తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సోఫా ముచ్చట్లే వినిపిస్తున్నాయి. సాధారణంగా రాజకీయాల్లో వెన్నుపోట్లు, క్యాంపు రాజకీయాలు చూస్తుంటాం కానీ, ఈసారి ఏకంగా సోఫా సెట్లే రాజకీయ సమీకరణాలను మార్చేశాయనే వార్త ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి విజయ్ తన ప్రభుత్వ మనుగడ కోసం మద్దతు కూడగట్టే క్రమంలో, వివిధ పార్టీల నేతల ఇళ్లకు వెళ్లడానికి ముందే అక్కడికి విలాసవంతమైన సోఫాలు చేరుకోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఒకరిద్దరి ఇళ్లకైతే యాదృచ్ఛికం అనుకోవచ్చు కానీ, వెళ్లిన ప్రతిచోటా ఇదే సీన్ రిపీట్ కావడంతో దీని వెనుక ఏదో పెద్ద విషయమే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ నేరుగా విమర్శల దాడికి దిగారు. అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం విశ్వాస తీర్మానం నెగ్గినప్పటికీ, ఆ గెలుపు ప్రజాస్వామ్యబద్ధంగా రాలేదని ఆయన ఆరోపిస్తున్నారు. మేము ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో కూర్చుంటే, మీరు మాత్రం ఎమ్మెల్యేలకు విలాసవంతమైన సోఫా సెట్లు పంపించి, వారిని ప్రలోభపెట్టి అధికారాన్ని దక్కించుకున్నారు అంటూ ఉదయనిధి ఎద్దేవా చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి డీఎంకే సోఫా మోడల్ అని పేరు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది.
ఈ సోఫా పాలిటిక్స్‌కు కారణం పుష్ప సినిమాలోని సోఫా సీన్లకు లింకు పెట్టడమే. సినిమాలో స్మగ్లింగ్ సొమ్మును సోఫాల్లో దాచినట్లుగానే, ఇక్కడ కూడా సోఫాల చాటున భారీ ఎత్తున చేతులు మారాయనే అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఈ సోఫా సెట్లనే వాడుకున్నారనేది డీఎంకే ప్రధాన ఆరోపణ. రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఇలాంటి విలాసవంతమైన కానుకలు పంపి ప్రలోభపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వాదిస్తున్నాయి.
ఈ విమర్శలపై విజయ్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. తాము హార్స్ ట్రేడింగ్ కు పాల్పడలేదని.. ప్రభుత్వం మాత్రం హార్స్ లా పరుగెడుతుందని అంటున్నారు. అయితే ఈ సోఫా మోడల్ సినిమాలతో లింక్ ఉండటంతో సోషల్ మీడియాలో వరైల్ అవుతోంది. విజయ్ వర్గానికి, ఈ సోఫా అస్త్రం ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారింది. కేవలం ఇవి మర్యాదపూర్వకంగా జరిగిన ఏర్పాట్లా లేక నిజంగానే ప్రలోభాల పర్వమా అనేది మాత్రం ఎప్పటికీ బయటకు రాకపోవచ్చు.
