చూస్తాం..భరిస్తాం.. కానీ సహనానికీ హద్దు ఉంటుంది. అది దాటితే మాత్రం తాట తీస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. నాగేశ్వర్ చెప్పిన పులిహోర కథలపై నేరుగానే విరుచుకుపడ్డారు. “మీ ఇష్టమొచ్చినట్లు మీరు మాట్లాడుతుంటే.. ఇక్కడ మేమేమీ చేతులు కట్టుకొని కూర్చోవాలా?” అంటూ ఆయన నేరుగా ప్రశ్నించారు.
తాను ఢిల్లీ వెళ్లి దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసిన ప్రతిసారీ.. కొందరు మేధావులు, ప్రత్యర్థులు కేవలం జైలు రాజకీయాల గురించే మాట్లాడుతున్నారని పవన్ మండిపడ్డారు. “నేను ప్రధానితో, అమిత్ షాతో మాట్లాడితే కేవలం వైసీపీ నేతల జైలు గురించే మాట్లాడుతామా? మీకు ఎంతసేపూ ఇవే కనిపిస్తాయా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి మేము చర్చించమా?” అంటూ నిలదీశారు. దేశాన్ని శాసించే పెద్దల దగ్గరకు వెళ్లి, కూర్చోబెట్టి వాళ్లని జైల్లో పెట్టండి, వీళ్లని జైల్లో పెట్టండి అని చెబుతామా? అసలు ఆ విషయాలు వాళ్లకి మేము చెప్పాలా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు జగన్ రెడ్డి జైలుకెళ్తే జనసేనకు.. తనకు ఏం లాభమనా…ఆయన ప్రశ్నించారు.
రాజకీయాల్లో తాము ఎంతో హుందాగా, ఓపికగా వ్యవహరిస్తుంటే కొందరు దానిని బలహీనతగా భావిస్తున్నారని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రతి చిన్న విషయానికి తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉండాలని, తప్పుడు నెరేటివ్లతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. “వ్యక్తిగత, రాజకీయ విమర్శలను భరిస్తాం.. సహిస్తాం.. కానీ హద్దులు దాటితే మాత్రం అవసరమైతే తాట తీస్తాం” అంటూ అత్యంత ఘాటుగా వ్యాఖ్యానించారు.
సాధారణంగా రాజకీయ విమర్శలపై జనసేనాని ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వడం చాలా అరుదు. అయితే, ఇటీవల నాగేశ్వర్ సృష్టించిన ‘బీజేపీ-జగన్ శాశ్వత మిత్రులు’ అనే తప్పుడు ప్రచారానికి, దానికి పవన్ ను ఆయుధంగా వాడుకోడం ఆయనను కోపం తెచ్చుకునేలా చేసింది. ఇలాంటి వాటిపై గట్టిగా స్పందించకపోతే ఇక ముందు చాలా అంటారని పవన్ నిర్ణయించుకున్నారు. అందుకే నాగేశ్వర్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాము ఢిల్లీ వెళ్లేది ఏపీ ప్రయోజనాల కోసమే తప్ప, చట్టం తన పని తాను చేసుకుపోయే కేసుల సెటిల్మెంట్ల కోసం కాదని ఆయన మాటల ద్వారా తేలిపోయింది.
