దివ్యేందు శర్మ… ఇలా చెబితే గుర్తు పట్టకపోవొచ్చు కానీ, ‘మీర్జాపూర్’ లో మున్నాభాయ్ అంటే.. టక్కున గుర్తొస్తాడు. ఆ ఒక్క సినిమాతో బోలెడంత పాపులారిటీని తెచ్చుకొన్నాడు దివ్యేందు. మున్నాభాయ్ క్యారెక్టర్, ఆ డైలాగులు తెలుగు జనాలకు నచ్చేశాయి. అయితే చాలా లేట్ గా ఈ కుర్రాడిని టాలీవుడ్ గుర్తించింది. ‘పెద్ది’ సినిమాలో విలన్ పాత్ర తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు దివ్యేందు. ఈ సినిమాలో రామ్ బుజ్జి పాత్రలో కనిపించబోతున్నాడు. ట్రైలర్ లో రామ్ బుజ్జీకి కూడా మంచి ఎలివేషన్లే పడ్డాయి. చరణ్ తో ఢీ కొనే పాత్ర ఇది. చాలా ఆప్షన్ల తరవాత బుచ్చిబాబు.. దివ్యేందుని సంప్రదించాడు. పైగా బుచ్చిబాబు కూడా ‘మీర్జాపూర్’ ఫ్యానే. ఆవెబ్ సిరీస్ చూశాకే.. విలన్ గా దివ్యేందు పేరుని ఖాయం చేసుకొన్నాడు.
తెలుగు చిత్రసీమ ఎప్పటికప్పుడు కొత్త విలన్ల కోసం జల్లెడ పడుతూనే ఉంటుంది. ఈమధ్య మాత్రం పరాయి భాష నుంచి విలన్లు తీసుకోవడం కొద్దిగా తగ్గింది. మాజీ హీరోల్ని విలన్లుగా ఒప్పించడంలో దర్శకులు సఫలీకృతం అవుతున్నారు. ఇలాంటి తరుణంలో నార్త్ నుంచి ఓ కుర్ర విలన్ ని పెద్ది కోసం రంగంలోకి దించుతున్నారు. ఈ సినిమా హిట్టయి, అందులో రామ్ బుజ్జి పాత్ర క్లిక్కయితే.. కుర్ర హీరోల పక్కన విలన్ కోసం పెద్దగా వెదుక్కోవాల్సిన పని తప్పుతుంది. దివ్యేందు మంచి ఆప్షన్ అవుతాడు.
”చరణ్ లాంటి స్టార్ తో పని చేయడం నాకు చాలా కిక్ ఇచ్చింది. రంగస్థలం చూశాను. అందులో తన నటన నన్ను కట్టిపడేసింది. ‘పెద్ది’ సెట్లోనూ తన నటనతో నన్ను ఆశ్చర్యపరిచాడు. తెలుగులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఉంది. ‘పెద్ది’ తరవాత ఆ స్థాయి గుర్తింపు దక్కుతుందన్న నమ్మకం ఉంద”న్నాడు దివ్యేందు.
