తెలంగాణలో వ్యవసాయ మోటర్లకు మీటర్ల ఏర్పాటు, ఉచిత విద్యుత్ సరఫరా అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులతో నిర్వహించిన చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయబోమన్నారు. అలాగే పెట్టకపోతే బీఆర్ఎస్ పోటీ చేయకూడదన్నారు. ఈ సవాల్‌పై టీఆర్ఎస్ అధినేత కవిత స్పందించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇటువంటి కీలక నిర్ణయాలను మూసి ఉన్న గదుల్లో జర్నలిస్టులతో చిట్ చాట్లలో చెప్పడం సరికాదని ఆమె ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టబోము, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాము అని బహిరంగంగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ఇలాంటి ఆఫ్ ది రికార్డ్ ముచ్చట్లను ప్రజలు గానీ, రైతులు గానీ నమ్మే పరిస్థితి లేదని కవిత స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పల్లెల్లో బహిరంగంగా ఇచ్చిన అనేక గ్యారెంటీలను, హామీలనే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని, ప్రజలకు ఇచ్చిన మాట తప్పిందని ఆమె విమర్శించారు. మైకుల ముందు చెప్పిన పెద్ద పెద్ద వాగ్దానాలకే దిక్కులేనప్పుడు.. జర్నలిస్టులతో క్యాజువల్‌గా మాట్లాడే చిట్ చాట్ ముచ్చట్లను రైతాంగం ఎలా నమ్ముతుందని కవిత ప్రశ్నించారు.
ప్రభుత్వానికి నిజంగానే రైతు సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే, తెరవెనుక మాటలు బంద్ చేసి నేరుగా ప్రెస్‌మీట్ పెట్టాలని రేవంత్ రెడ్డికి కవిత సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి కెమెరాల ముందు చెప్తేనే ఆ మాటకు చట్టబద్ధత, జవాబుదారీతనం ఉంటాయని ఆమె పేర్కొన్నారు. గతంలో అనేక సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు మోటర్లకు మీటర్ల వ్యవహారంపై ఆందోళన చెందుతున్నారని.. ఈ గందరగోళానికి తెరదించాల్సిన బాధ్యత పూర్తిగా ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు
ఉచిత విద్యుత్, వ్యవసాయ సబ్సిడీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కోతలు పెట్టినా, లూప్‌హోల్స్ వెతికినా ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ సమస్యలపై, విద్యుత్ సరఫరా లోపాలపై తమ పార్టీ శ్రేణులు పల్లెల్లో ఉద్యమిస్తాయని.. ప్రభుత్వం వెంటనే తన వైఖరిని అధికారిక ప్రకటన ద్వారా స్పష్టం చేయాలని కవిత గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.