బతికున్నంత కాలం బీఆర్ఎస్లోనే ఉంటానని.. నా పుట్టుక బీఆర్ఎస్లో .. చావుకూడా బీఆర్ఎస్లోనని హరీష్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులతో నిర్వహించిన చిట్ చాట్‌లో హరీష్ రావు తాను బీఆర్ఎస్లోనే ఉంటానని కేసీఆర్‌పై ఒట్టేసి చెప్పాలని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
మీడియా సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భావోద్వేగ భరితమైన కౌంటర్ ఇచ్చారు. తన పొలిటికల్ అస్తిత్వం, విధేయతపై వస్తున్న ఊహాగానాలకు గట్టి సమాధానమిచ్చారు.
మళ్లీ మళ్లీ చెబుతున్నా.. నా జీవితం అంతా కేసీఆర్ తోనే ముడిపడి ఉంది అని హరీష్ రావు స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానం కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే సాగిందని, ఆయనపై తనకు ఉన్న గౌరవాన్ని ఎవరూ శంకించలేరని పేర్కొన్నారు. బతికున్నంత కాలం తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ పాలిటిక్స్ ఆడుతూ ప్రతిపక్షంలో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని, కానీ తన విషయంలో ఆ పప్పులు ఉడకవని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
తెలంగాణ మలిదశ ఉద్యమ కాలం నుండి తాను గులాబీ జెండాను మోస్తున్నానని, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానని హరీష్ రావు గుర్తుచేశారు. నా పుట్టుక, చావు రెండూ బీఆర్ఎస్ పార్టీలోనే జరుగుతాయి అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి లాగా తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని, నిఖార్సైన ఉద్యమకారుడిగా పార్టీ అధినేత కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. తనపై ఒట్లు పెట్టాలని కోరే హక్కు రేవంత్‌కు లేదని, ముందు సీఎం తన సొంత పార్టీ హామీలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, ద్రవ్యోల్బణం, ఇతర పరిపాలనా లోపాలను కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యక్తిగత సవాళ్లను తెరపైకి తెస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టే అంశంపై అధికారికంగా స్పందించకుండా, ఇలాంటి పొలిటికల్ డ్రామాలను రక్తికట్టించాలని చూడటం రేవంత్ రెడ్డి నైజమని విమర్శించారు. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి, ఇచ్చిన హామీల అమలుపై ప్రెస్ మీట్ పెట్టాలని, తన రాజకీయ భవిష్యత్తు గురించి రేవంత్ రెడ్డి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరీష్ రావు సలహా ఇచ్చారు.
