ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం మరోసారి హింసాత్మక ఆందోళనలతో దద్దరిల్లింది. ఫ్రెంచ్ ఫుట్‌బాల్ దిగ్గజ క్లబ్ పారిస్ సెయింట్-జర్మన్ లీగ్ మ్యాచ్ ముగిసిన అనంతరం పారిస్ వీధుల్లోకి వచ్చిన వందలాది మంది ఆందోళనకారులు, అభిమానులు పెద్ద ఎత్తున విధ్వంసానికి దిగారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం, దుకాణాల కిటికీలు పగలగొట్టడం, కారులకు నిప్పు పెట్టడంతో పారిస్ వీధులు రణరంగాన్ని తలపించాయి. ఇప్పటికీ అదే పరిస్థితి ఉదంి.
ఇది ఓటమి అసంతృప్తి కాదు!
పైకి ఇది కేవలం ఫుట్‌బాల్ అభిమానుల ఘర్షణగా కనిపిస్తున్నప్పటికీ.. దీని వెనుక ఫ్రాన్స్‌లో సుదీర్ఘకాలంగా నడుస్తున్న సామాజిక, ఆర్థిక అసంతృప్తి ప్రధాన కారణం. పారిస్ శివారు ప్రాంతాల్లో నివసించే శ్రామిక వర్గ యువత, వలసదారులు.. ఫ్రెంచ్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, గృహ వసతి కొరత , ఫ్రెంచ్ పోలీసుల కఠినమైన వైఖరిపై యువతలో పేరుకుపోయిన అసంతృప్తికి, ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ వేదికగా ఒక హింసాత్మక రూపానికి కారణం అయింది. తమ గళాన్ని వినిపించేందుకు క్రీడా ఈవెంట్లను ఆందోళనకారులు ఒక సాధనంగా వాడుకున్నట్లు స్పష్టమవుతోంది.
పోలీస్ వ్యవస్థపై తిరుగుబాటు
ఈ నిరసనల్లో ఆందోళనకారులు ప్రధానంగా పారిస్ పోలీసులను, ప్రభుత్వ భవనాలను టార్గెట్ చేశారు. ఫ్రాన్స్‌లో ఇటీవల కాలంలో మైనారిటీలు, వలసదారులపై పోలీసుల దాడులు , జాతి వివక్ష పెరిగిపోయాయంటూ యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు జరిపే తనిఖీలు తమను కించపరిచేలా ఉన్నాయని, అందుకే తాము వీధుల్లోకి వచ్చి నిరసన తెలపాల్సి వచ్చిందని ఆందోళనకారులు పేర్కొంటున్నారు. పోలీసులపైకి రాళ్లు, బాణసంచా విసురుతూ వారు జరిపిన దాడులు.. పారిస్‌లో పాలకులకు, సామాన్య ప్రజలకు మధ్య పెరిగిన అంతరాన్ని నిరూపిస్తున్నాయి.
పర్యటక రంగానికి దెబ్బ
విధ్వంసకర ఘటనలు అంతర్జాతీయంగా ఫ్రాన్స్ ప్రతిష్టను దెబ్బతీసేలా మారాయి. పారిస్ నగర భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో, స్థానిక పర్యటక రంగంపై దీని ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఫ్రెంచ్ ప్రభుత్వానికి ఈ హైపర్-లోకల్ ఐడెంటిటీ గొడవలు తీవ్ర సవాల్‌గా మారాయి. నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అదనపు బలగాలను మోహరించినట్లు పారిస్ అధికారులు ప్రకటించినప్పటికీ.. యువతలో ఉన్న అసలైన సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించనంత కాలం ఇలాంటి నిశ్శబ్ద విప్లవాలు పదే పదే బద్దలవుతూనే ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
