తమిళనాడు రాజకీయాల్లో మరో పెను సంచలనానికి తెరలేచింది. మాజీ ఐపీఎస్ అధికారి, బీజేపీ తమిళనాడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను పార్టీ అధిష్టానం ఆమోదించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రెస్ రిలీజ్‌ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, అన్నామలై రాజీనామాను తక్షణమే ఆమోదించినట్లు ప్రకటించారు.
ఈ అధికారిక ప్రకటనతో అన్నామలై సొంతంగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారనే ప్రచారానికి బలం చేకూరినట్లయింది. కొంతకాలంగా తమిళనాడు క్షేత్రస్థాయి రాజకీయాల్లో ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అన్నామలై తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ సిద్ధాంతాలు, ఇక్కడి స్థానిక సమీకరణాల మధ్య కొన్ని వ్యూహాత్మక అడ్డంకులు ఎదురవువడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు బీజేపీ నుంచి అధికారికంగా విముక్తి లభించడంతో, ఆయన తన సొంత పొలిటికల్ రోడ్ మ్యాప్‌ను అమలు చేయడానికి మార్గం సుగమమైంది.
అన్నామలై బీజేపీని వీడటం వెనుక తమిళనాడులో ప్రాంతీయ అస్తిత్వాన్ని మరింత బలంగా చాటాలనే వ్యూహం ఉంది. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే వంటి కొత్త శక్తులు పుట్టుకొస్తున్న తరుణంలో.. అన్నామలై కూడా క్లీన్ ఇమేజ్ ఉన్న మాజీ ఐపీఎస్ అధికారిగా, యువతను ఆకట్టుకునే అజెండాతో సరికొత్త ప్రాంతీయ పార్టీని ప్రకటించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో బంధం తెగిపోవడంతో ఆయనకు పార్టీ పరంగా ఉన్న అన్ని రకాల అడ్డంకులు, ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి.
అన్నామలై తన కొత్త పార్టీ పేరును, జెండాను ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారనే అంశంపై తమిళనాడు వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకేల సాంప్రదాయ రాజకీయాలకు గట్టి పోటీ ఇచ్చేలా ఆయన తన తదుపరి అడుగులను వేయబోతున్నట్లు సమాచారం.
