ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడైన డిజిటల్ ప్లానర్ సునీల్ కనుగోలును కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ శివకుమార్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సునీల్ కనుగోలుకు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు పదవితో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన క్యాబినెట్ హోదాను కల్పించారు. దీనివల్ల ఒక మంత్రికి లభించే అధికారిక నివాసం, రవాణా, ప్రోటోకాల్ ,ఇతర సకల ప్రభుత్వ సౌకర్యాలు, భత్యాలు ఆయనకు లభించనున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వ విధానాల రూపకల్పనలో, పరిపాలనాపరమైన వ్యూహాలలో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నట్లు ఈ జీవో స్పష్టం చేస్తోంది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని జీవోలో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు సునీల్ కనుగోలు ఈ పదవిలో కొనసాగుతారు. బెంగళూరు జేపీ నగర్, 4వ ఫేజ్ నివాసి అయిన సునీల్ కనుగోలు గతంలో కర్ణా టక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వెనుక ఉండి వ్యూహాలు రచించారు. ఆ నమ్మకంతోనే ప్రభుత్వం ఆయనకు ఈ అవకాశాన్ని కల్పించారు. నిజానికి గతంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వం కూడా ఈ అవకాశం కల్పించినప్పటికీ ఆయన తీసుకోలేదు.
ఇటీవల సునీల్ కనుగోలను రేవంత్ రెడ్డి అధికారికంగా సలహాదారుగా నియమించుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన డీకే శివకుమార్ సలహాదారుగా మారారు. ఇది అధికారిక హోదానే అయినప్పటికీ ఆయన చేసే పనుల్లో పెద్దగా తేడా ఉండదు. ప్రస్తుతం ఆయన ఏజెన్సీ కాంగ్రెస్ కోసం పని చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ప్లాన్ అంతా కనుగోలు ఏజెన్సీనే ఇస్తోంది. ఆయనే కీలక అంశాలపై సీఎం రేవంత్‌కు సలహాలిస్తున్నారని అంటున్నారు.
తెర ముందుకు రావడానికి ఎప్పుడూ ఆసక్తి చూపని సునీల్ కనుగోలు.. తెర వెనుక వ్యూహాల్లో మాత్రం దిట్ట. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ ఉనికి బలంగా ఉండటానికి ఆయనే కారణం అని కాంగ్రెస్ హైకమాండ్ కు గట్టి నమ్మకం. అందుకే జాతీయ స్థాయిలో ఆయన సేవలు తీసుకుంటున్నారు.
