మొన్నటి వరకూ వేసవి గాలులకు ఠారెత్తిపోయారు భాగ్యనగర వాసులు. ఇప్పుడు వర్షాలు భయపెడుతున్నాయి. ఈ సీజన్ లో తొలిసారి కురిసిన వర్షానికే హైదరాబాద్ చిగురుటాకులా వణికింది. నగరంలో సాయింత్రం 4 గంటల నుంచి 6 వరకూ వర్షం దంచి కొట్టింది. ఉరుములు, మెరుపులూ, జోరు గాలితో… రెండు గంటల పాటు నగర వాసుల్ని కుదిపేసింది. హైటెక్ సిటీ, లింగం పల్లి, మియాపూర్, షేక్ పేట, బషీర్ బాగ్, ట్యాంక్ బండ్, నారాయణ గూడ, కోఠి.. ఇలా నగరం నలుమూలలా భారీ వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మరణించారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ మరింత ఎక్కువైంది. హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా మారింది. దాదాపు గంట పాటు ట్రాఫిక్ స్థంభించింది. అంబులెన్స్ లు సైతం అంగుళం కూడా కదల్లేదు.
రానున్న రెండు మూడు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ తగిన జాగ్రత్తలు తీసుకొంటే మంచిది. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుకుపోతోంది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. హైదరాబాద్ లో ముందు నుంచీ ఉన్న సమస్యే ఇది. కాసేపు వర్షం పడితే చాలు.. రోడ్లన్నీ జలమయం అవుతాయి. మణికొండ, షేక్ పేట, కృష్ణానగర్ లాంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల బాధైతే వర్ణనాతీతం. ఈ సీజన్లో ఇది తొలి వర్షం. ఈ వర్షానికే.. డ్రైనేజీ వ్యవస్థలోని లోపాలన్నీ బయట పడిపోయాయి. ఇక ముందైనా జీహెచ్ఎంసీ ముందు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ లోని మిగిలిన జిల్లాల్లోనూ రానున్న రెండు రోజులు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
