వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్ తాజా సంచలనం. ఐపీఎల్ లో అదరగొట్టేశాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ.. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆరెంజ్ క్యాప్ అందుకోవడంతో పాటుగా పలు అవార్డులు సొంతం చేసుకొన్నాడు. ఐర్లాండ్ తో జరిగే సిరీస్ కి ఎంపికై, అతి పిన్న వయసులోనే భారత జట్టులో చోటు సంపాదించుకొని, సచిన్ టెండూల్కర్ రికార్డ్ తిరగరాశాడు. తనని ఫ్యూచర్ స్టార్ అంటూ ఇప్పటికే మాజీలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే.. ఐర్లాండ్ తో సిరీస్ కు ముందు భారత ఏ జట్టులో సభ్యుడిగా శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. ఈరోజు అక్కడ శ్రీలంక ఏ జట్టుతో భారత్ ఏ జట్టు తలపడింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో… వైభవ్ పై అప్పుడే మిమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టేస్తున్నారు నెటిజన్లు.
వైభవ్ సత్తా ఐపీఎల్ వరకే అని, విదేశీ పిచ్ లపై ఆడలేడంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. డబ్బులు దొరికే ఐపీఎల్ లో విన్యాసాలు చూపించడం కాదు, దేశం తరపున ఆడేటప్పుడు అసలు సత్తా బయటకు వస్తుంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ సిరీస్ వైభవ్ కి చాలా కీలకం. ఐర్లాండ్ తో సిరీస్ కు ముందు వైభవ్ కు ప్రాక్టీస్ దొరుకుతుంది. విదేశీ పిచ్‌లపై ఎడా ఆడాలో తనకు కాస్త అనుభవం వస్తుంది. అయితే ఈలోగా ఇలాంటి విమర్శలకు కాచుకొని కూర్చోవాల్సిందే. వైభవ్ వయసు పదిహేనేళ్లు మాత్రమే. ఈ వయసులో ఒత్తిడి ఎదుర్కొని ఆడడం మామూలు విషయం కాదు. విమర్శకులు కూడా ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. వైభవ్ కి కాస్త సమయం ఇవ్వాలి. ముందు ఐర్లాండ్ సిరీస్ లో ఎలా ఆడతాడో చూడాలి. ఆ తరవాత తనపై జడ్జిమెంట్ పాస్ చేయడం మంచిది. తొలి రోజుల్లోనే ఈ కుర్రాడిపై ఒత్తిడి పెంచడం కూడా సరి కాదు. ఈ విషయంలో బీసీసీఐ, టీమ్ మేనేజ్ మెంట్, కోచ్, కెప్టెన్ వీళ్లంతా వైభవ్ కి అండగా ఉండడమే కాకుండా, తనలో మనో దైర్యాన్ని నింపాలి.
అన్నట్టు ఈ మ్యాచ్ లో భారత్ శ్రీలంక పై ఘన విజయం సాధించింది. కెప్టెన్ గైక్వాడ్ (101) సెంచరీతో అదరగొట్టాడు. బ్యాటింగ్ లో విఫలమైన వైభవ్… బౌలింగ్ లో మాత్రం ఆకట్టుకొన్నాడు. ఒక వికెట్ తీశాడు. బౌలింగ్ పై దృష్టి పెడితే వైభవ్‌ని పార్ట్ టైమ్ బౌలర్ గానూ వాడుకోవొచ్చన్నమాట.
