భారత ప్రజాస్వామ్యంలో రూల్స్ అందరికీ ఒకటి లకాదు. హైడ్రామా లేని రోజంటూ దేశ రాజకీయాల్లో ఉండటం లేదు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి, రాహుల్ గాంధీ కోటరీకి చెందిన సీనియర్ నేత మీనాక్షీ నటరాజన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం జాతీయ స్థాయిలో పెను తుఫాను రేపింది. హైదరాబాద్ లో తనపై ఉన్న ఒక పాత కేసు వివరాలను అఫిడవిట్లో దాచారనే నెపంతో ఆమెపై ఈ వేటు వేశారు. అయితే, ఆమెపై ఉన్నది అసలైన క్రిమినల్ కేసు కాదని, రాజకీయ నిరసనలకు సంబంధించిన ఒక చిన్న విషయంలో వచ్చిన షోకాజ్ నోటీసు మాత్రమేనని, దీనికి నామినేషన్ రద్దు చేయడం పూర్తిగా అప్రజాస్వామికమని కాంగ్రెస్ అంటోంది.
నత్వానీకి అదే సమస్య – కానీ నామినేషన్ తిరస్కరించలేదు!
జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న, అధికార బీజేపీ మద్దతు ప్రకటించిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ నామినేషన్ పత్రాల్లో కూడా సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. అయితే, అక్కడ రిటర్నింగ్ అధికారి నత్వానీ నామినేషన్‌ను వెంటనే రద్దు చేయకుండా.. ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు సమయం ఇచ్చారు. మరి ఇదే సూత్రాన్ని, ఇదే లీగల్ ప్రిన్సిపల్‌ను మధ్యప్రదేశ్‌లో మీనాక్షీ నటరాజన్ విషయంలో ఎందుకు పాటించలేదు? అన్నది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిన అతి పెద్ద ప్రశ్న.
ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిందే !
ఈ రెండు విభిన్న పరిణామాలు భారత ఎన్నికల సంఘం నిష్పాక్షికతను మరోసారి తీవ్రమైన ప్రశ్నిస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం అనేది ఒక న్యూట్రల్ అంపైర్ లా వ్యవహరించాలి. నిబంధనల అమలులో అధికార పక్షానికి ఒకలా, విపక్షానికి మరోలా త్రాసు మారితే ఆ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకం సడలిపోతుంది. నామినేషన్లలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు వాటిని సవరించుకునే అవకాశం అభ్యర్థులందరికీ సమానంగా ఇవ్వాలి. కానీ, బీజేపీ మద్దతుదారుడికి సమయం ఇచ్చి, కాంగ్రెస్ అభ్యర్థిపై తక్షణమే వేటు వేయడం వెనుక స్పష్టమైన రాజకీయ పక్షపాతం కనిపిస్తోందని సామాన్య ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది.
అధికారంలో ఉన్న వారికే చట్టాలు అనుకూలమా?
ప్రస్తుత రాజకీయాల్లో చట్టాలు, నిబంధనలు అనేవి కేవలం అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా, విపక్షాలను అణచివేయడానికి సాధనాలుగా మారిపోతున్నాయనే వాదనకు ఈ ఉదంతం బలమైన ఉదాహరణగా నిలుస్తోంది. మీనాక్షీ నటరాజన్ నామినేషన్ రద్దు కావడం వల్ల మధ్యప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయ్యే మార్గం సుగమమైంది. మరి ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని, జార్ఖండ్‌లో పాటించిన సవరణ అవకాశాన్ని మధ్యప్రదేశ్‌లోనూ వర్తింపజేసి తన రాజ్యాంగబద్ధమైన నిష్పాక్షికతను నిరూపించుకుంటుందో లేదో వేచి చూడాలి. అలా జరగని పక్షంలో.. ఈ వ్యవహారం న్యాయస్థానాలకు చేరడం, అక్కడ సుదీర్ఘ లీగల్ బ్యాటిల్ నడవడమే కాకుండా, భారత ఎన్నికల వ్యవస్థపై మరో పెద్ద మచ్చగా మిగిలిపోవడం ఖాయం!


