సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోందనడానికి, రాజకీయాలు ఎంతటి దిగజారుడు స్థాయికి చేరుకున్నాయనడానికి తాజా ఉదాహరణగా నిలిచింది విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన తదనంతర పరిణామాలు. ఫ్యాక్టరీలో వేల డిగ్రీల సెల్సియస్ వేడితో మరుగుతున్న ద్రవ ఉక్కు ఒలికిపోయి, కళ్ల ముందే తోటి కార్మికులు సజీవ దహనమైపోయిన ఆ ఘోర విపత్తు యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది. కుటుంబ యజమానులను కోల్పోయి ఆ ఇళ్లల్లో మృతదేహాలు ఇంకా మార్చురీలోనే ఉన్న తరుణంలో.. బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పాల్సిన సమయమది. కానీ, దురదృష్టవశాత్తూ కొన్ని రాజకీయ శక్తులకు అది తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, శవాలపై పేలాలు ఏరుకోవడానికి దొరికిన అద్భుతమైన అవకాశంగా కనిపించడం అత్యంత హేయం.
బాధిత కుటుంబాలకు పూర్తి భరోసా
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ తక్షణమే సహాయక చర్యలు చేపట్టింది. బాధితులకు కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా.. తక్షణ సాయంగా రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, భవిష్యత్తుకు భరోసానిస్తూ కుటుంబంలో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కేంద్ర, రాష్ట్ర మంత్రులు అధికారికంగా ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు భరోసా ఇచ్చేందుకు మంత్రి నారా లోకేష్, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, హోంమంత్రి అనితతో కలిసి స్వయంగా విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి చేరుకున్నారు.
రాబందుల రాజకీయం చేసిన ఇతర పార్టీలు
అయితే, అక్కడ కనిపించిన దృశ్యాలు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. తీవ్ర ఆవేదనలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులతో మంత్రి లోకేష్‌ను మాట్లాడనీయకుండా, వారి గోడును విననీయకుండా కొన్ని విపక్ష శక్తులు, ట్రేడ్ యూనియన్ల ముసుగులో ఉన్న నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడ్డారు. మృతదేహాలు ఆసుపత్రిలో ఉండగానే.. అక్కడ శవ రాజకీయం చేయడానికి రాబందుల్లా వాలిపోయారు. ప్రభుత్వం ఉద్యోగంతో పాటు పరిహారం ఇస్తామని చెబుతున్నా.. వినడానికి సిద్ధంగా లేకుండా కేవలం గొడవ చేయడమే లక్ష్యంగా మైకులు పట్టుకుని రచ్చ చేశారు. శవాల చుట్టూ రాజకీయం తిప్పాలనే వారి ఆరాటం అక్కడ స్పష్టంగా కనిపించింది.
పెయిడ్ ఆర్టిస్టులతో వైసీపీది ఓ వింత గోల
పనిలో పనిగా ప్రధాన ప్రతిపక్షమైన వైసీపి నేతలు కొందరు వెనుక ఉండి నడిపిస్తూ.. అక్కడికి పెయిడ్ ఆర్టిస్టులను తరలించి, ప్రభుత్వంపై నినాదాలు చేయించడం అత్యంత దారుణం. అసలు ప్రమాదంలో చనిపోయింది ఎవరు? అక్కడ ఏడుస్తోంది ఎవరు? అని కూడా చూడకుండా.. శవాల ముందు పొలిటికల్ డ్రామాలు ఆడుతుంటే, స్వయంగా సర్వం కోల్పోయిన ఆ బాధిత కుటుంబాలే వారి ప్రవర్తనను చూసి సిగ్గుతో తలదించుకున్నాయి. తమ ఇంట్లో మనుషులు చనిపోతే.. ఈ రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం దాన్ని ఒక ఈవెంట్‌లా మార్చడాన్ని చూసి ఆ కుటుంబాలు ఎంత మానసిక క్షోభను అనుభవించి ఉంటాయో ఊహించుకోవడానికే భయమేస్తుంది.
బాధితుల కన్నీళ్లు కాస్త చూడండి !
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడటం అంటే శవాల వద్ద మైకులు పెట్టి అరిచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం కాదు. ఆ కుటుంబానికి శాశ్వత అండగా ఉండేలా చూడటం. ప్రభుత్వం తక్షణమే పరిహారం, ఉద్యోగం ప్రకటించిన తర్వాత కూడా ఇంకా గొడవలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ముమ్మాటికీ దుర్మార్గం. ఇటువంటి శవ రాజకీయాలు చేసే వారికి, బాధిత కుటుంబాల కన్నీళ్లలో తమ ఓట్ల పంట పండించుకోవాలనుకునే శక్తులకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. రాజకీయాలకు ఆడేందుకు చాలా వేదికలు ఉంటాయి.. కానీ చావు ఇళ్లలో, శవాల ముందు ఆడే ఇలాంటి నీచమైన క్రీడలకు సమాజంలో తావుండకూడదు.