రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. గ్రామీణ నేపధ్యాన్ని బలంగా ప్రతిబింబిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆసక్తిగా అడగడం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో రామ్ చరణ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల ప్రధాని మోడీని కలిసిన సందర్భంగా ఆయన ‘పెద్ది’ గురించి అడిగారని చరణ్ తెలిపారు. అప్పుడు ఈ సినిమా గ్రామాలకు సాధికారతను అందించే కాన్సెప్ట్‌తో రూపొందుతోందని చెప్పానని వివరించారు.
సాధారణంగా భారీ పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడేటప్పుడు యాక్షన్, విజువల్స్, బాక్సాఫీస్ స్థాయి గురించి చర్చ జరుగుతుంది. కానీ ‘పెద్ది’ విషయంలో వాటితో పాటు గ్రామాల సాధికారత, స్ఫూర్తి, గుర్తింపు వంటి అంశాలు కూడా హైలెట్ చేస్తున్నారు. ఇది కేవలం మాస్ ఎంటర్టైనర్ మాత్రమే కాదని, ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాని సంకేతాలు ఇస్తున్నారు.
ప్రధాని మోడీ కూడా గ్రామాభివృద్ధి, స్వయం సమృద్ధి, గ్రామ సాధికారత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాంటి సమయంలో అలాంటి అంశాలతో ముడిపడి రూపొందుతున్న సినిమా గురించి ఆయన ఆసక్తిగా అడగడం సహజంగానే చర్చనీయాంశమైంది.
మరోవైపు రామ్ చరణ్ కూడా ప్రతి ఈవెంట్లో ‘పెద్ది’ని కేవలం కమర్షియల్ సినిమా కాదు, స్ఫూర్తినిచ్చే కథగా అభివర్ణిస్తున్నారు. తన కెరీర్లోనే ఇది అత్యంత ప్రత్యేకమైన సినిమా అవుతుందని పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు మోడీ ఆసక్తి అంశం బయటికి రావడంతో ‘పెద్ది’పై నేషనల్ లెవెల్లో మరింత దృష్టి పడే అవకాశం కనిపిస్తోంది.
