ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన రూ. 3,500 కోట్ల బహుళ కోట్ల మద్యం కుంభకోణం లో విజయసాయిరెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట ఆయన గురువారం మరోసారి విచారణకు హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుండి విజయసాయిరెడ్డి ఈడీ అధికారుల ముందుకు రావడం ఇది మూడోసారి . హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులు సాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానాన్ని నిబంధనలకు విరుద్ధంగా మార్చడం, కొన్ని నిర్దిష్ట డిస్టిలరీలకే లాభం చేకూరేలా కార్టలైజేషన్ కు సహకరించడం ద్వారా వందల కోట్ల రూపాయల కిక్‌బ్యాక్‌లు అందాయనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. గత నెలలోనే ఈడీ అధికారులు హైదరాబాద్, తిరుపతిలోని విజయసాయిరెడ్డి నివాసాలు, కార్యాలయాలతో పాటు ఆయన అనుచరుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, డిజిటల్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో లభించిన ఆర్థిక లావాదేవీల డైరీలు, షెల్ కంపెనీల బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగానే ఈడీ ఈ తాజా సమన్లు జారీ చేసి ఆయనను బోనులో నిలబెట్టింది.
ఈడీ అధికారులు ప్రధానంగా మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన నిధులను రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి, వైల్డర్నెస్ రాంచ్ , ప్రైడ్ వంటి ప్రాజెక్టుల్లోకి ఎలా మళ్లించారనే దానిపై విజయసాయిరెడ్డిని గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గత విచారణల సమయంలో ఆయన.. లిక్కర్ స్కామ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు, అంతా రాజ్ కేసిరెడ్డి, మిథున్ రెడ్డిలే చూసుకున్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డికి రూ. 100 కోట్లు సర్దమంటేనే నేను కేవలం మధ్యవర్తిత్వం వహించాను అంటూ ఇచ్చిన స్టేట్మెంట్లపై ఈడీ మరిన్ని స్పష్టతలు కోరింది. లీలా డిస్టిలరీస్, ఈశాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వంటి సంస్థల ద్వారా జరిగిన నగదు బదిలీల వెనుక అసలు సూత్రధారులు ఎవరనే దానిపై సాయిరెడ్డి వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేశారు.
గతంలో జగన్ మోహన్ రెడ్డికి కుడిభుజంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి.. ఈ కేసు దర్యాప్తు తీవ్రమయ్యాక పార్టీ అంతర్గత కోటరీపై తీవ్ర విమర్శలు చేస్తూ దూరం జరిగారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అప్రూవర్ గా మారే ప్రసక్తే లేదని ఆయన పైకి చెబుతున్నప్పటికీ, ఈడీ వరుసగా మూడోసారి పిలిపించి గంటల తరబడి విచారించడం చూస్తుంటే.. ఈ లిక్కర్ స్కామ్ లో మరికొందరు కీలక వైఎస్సార్సీపీ పెద్దల పేర్లు బయటకు రావడం ఖాయమని భావిస్తున్నారు.
