“మాఫియా చేతిలో ఆయుధం ఉంటే ఒక ప్రాంతం భయపడుతుంది. అదే మాఫియా చేతికి రాజకీయ అధికారం వస్తే.. చట్టమే ఆయుధంగా మారి ఒక భవిష్యత్తే సమాధి అవుతుంది. జగన్ రెడ్డి పదేళ్ల పాలనలో జరిగింది ఇదే “
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సాగిన ఐదేళ్ల పరిపాలన కేవలం ప్రజా వ్యతిరేక పాలన మాత్రమే కాదు. అది వ్యవస్థాగతంగా, వ్యూహాత్మకంగా సాగిన ఒక వ్యవస్థీకృత మాఫియా సామ్రాజ్యం. అధికారంలోకి రాకముందు ముద్దులు పెట్టి, నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ నమ్మబలికిన జగన్ రెడ్డి, గద్దెనెక్కిన తర్వాత రాష్ట్రాన్ని, ప్రజలను ఎలా నిలువుదోపిడీ చేశారో ఇప్పుడు దర్యాప్తు సంస్థలైన ఈడీ , సిట్ విచారణలో బయటపడుతున్న నిజాలు చూస్తుంటే సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కుల, మత, ప్రాంతీయ బేధాలనే అడ్డుతెరలను తొలగించి నిశితంగా పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మున్నెన్నడూ ఎరుగని ఘోరమైన ఆర్థిక, వనరుల విధ్వంసం ఈ ఐదేళ్లలో జరిగిందని స్పష్టమవుతోంది. కానీ మన రాష్ట్రంలో కొంత మంది ఇప్పటికీ చంద్రబాబుపై ద్వేషంతోనో..టీడీపీపై కోపంతోనే… కులం, మతంపై ప్రేమతోనే జరిగిన దోపిడీ గురించి తెలిసినా సరే సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. నిజం తెలిసినా వారు చేస్తున్న తప్పు.. భావితరాలకు పెనుశాపంగా మారుతుంది. ఆ భావితరాల్లో వారి కుటుంబాలు కూడా ఉంటాయని మరచిపోతున్నారు.
లిక్కర్ సామ్రాజ్యం – మందుబాబుల రక్తపు సిరి!
రాజకీయాల్లో నాయకులు వనరులను దోచుకోవడం మనం చూశాం, కానీ ప్రజల రక్తాన్ని, వారి దైనందిన జీవితాలను, చివరికి చిన్న పిల్లల భవిష్యత్తును కూడా ఒక మాఫియా తరహాలో స్కెచ్ వేసి దోచుకోవడం కేవలం జగన్ రెడ్డి మార్క్ పాలనలోనే సాధ్యమైంది ఐదేళ్లలో ఏపీలో సాగిన మద్యం వ్యాపారం ఒక మైండ్ బ్లోయింగ్ అక్రమ వ్యాపార సామ్రాజ్యం. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతోందని నమ్మించి, తెరవెనుక కొన్ని డిస్టిలరీల నుంచి మాత్రమే దాదాపు 70 శాతం మేర ఆర్డర్లు ఇప్పించి వేల కోట్ల రూపాయల కిక్‌బ్యాక్‌లు అందుకున్న వైనాన్ని సిట్ ఛార్జ్షీట్లలో బట్టబయలు చేసింది. బ్రాండ్ ప్రమోషన్ పేరుతో బోగస్ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించి, ఆపై హవాలా రూపంలో తాడేపల్లి ప్యాలెస్‌కు ఈ సొమ్ము చేరినట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ పరిధిలోని ఒక ఫామ్‌హౌస్‌లో దొరికిన రూ. 11 కోట్ల అట్టపెట్టెల నగదు నుంచి ప్రారంభమై.. తవ్వేకొద్దీ వేల కోట్ల అక్రమ మద్యం సిండికేట్ గుట్టు రట్టవుతోంది. నాసిరకం బ్రాండ్లను అధిక ధరలకు అమ్మి, సామాన్య మందుబాబుల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తూ, వారి రక్తాన్ని పీల్చి పిప్పి చేసిన ఈ దోపిడీ అనన్య సామాన్యం.
ఇసుకాసురుల వేట – ఏపీ వనరులు నాలుగు రాష్ట్రాల పాలు!
రాష్ట్రంపై జగన్ రెడ్డి కూర్చున్న మొదటి రోజే ఇసుక పాలసీని అస్తవ్యస్తం చేసి, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు. జేపీవీఎస్ , జీసీకేసీ, ప్రతిమ, టర్న్‌కీ వంటి సంస్థల ముసుగులో గనుల శాఖ ఉన్నతాధికారులను గుప్పిట్లో పెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు రూ. 2,566 కోట్ల నష్టం తెచ్చినట్లు విజిలెన్స్, ఏసీబీ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ఇసుక మాఫియా నెట్వర్క్ కేవలం ఏపీకే పరిమితం కాలేదు. తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్ వరకు విస్తరించింది. ఈడీ అధికారులు ఏకకాలంలో నాలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడం జగన్ రెడ్డి నడిపిన అంతరాష్ట్ర ఇసుక దోపిడీకి సజీవ సాక్ష్యం. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం గాల్లోకి లేపేసి, రాత్రింబవళ్లు నదీగర్భాలను తవ్వేసి నవ్యాంధ్ర ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. పేదలకు ‘నవరత్నాలు’ అంటూ సెంట్ల స్థలాల పేరుతో చేసిన ప్రచారం వెనుక పెద్ద భూకుంభకోణం దాగుంది. ఎందుకూ పనికిరాని, లోతట్టు ప్రాంతాలు చౌకగా కొని, ప్రభుత్వ ఖజానా నుంచి వేల కోట్లు దారపోసి జగన్ అనుచరులు, వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారు. ఎప్పుడో ఇందిరమ్మ, ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్లకు వన్-టైమ్ సెటిల్మెంట్ పేరుతో బాకీలు తీరిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామంటూ పేద ప్రజల కడుపు కొట్టి మరీ వసూళ్లకు పాల్పడ్డారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా నుంచి ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టులోనూ స్కామ్‌ల పరంపర సాగింది.
సీఎంవో సెటిల్మెంట్లు పరాకాష్ట
“అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు” రాష్ట్రంలో సర్వ వనరులు ఉన్నా, అన్నీ తాడేపల్లి గద్దల పాలయ్యాయి. సీఎం జగన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కేఎన్నార్ చేసిన వందల కోట్ల రూపాయల ల్యాండ్ సెటిల్మెంట్లు, బ్రోకరేజ్ వ్యవహారాలు ఇప్పుడు సిట్ విచారణలో వెలుగు చూస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు, అండ లేకుండా ఒక పీఏ స్థాయి వ్యక్తి వందల కోట్ల సెటిల్మెంట్లు చేయగలడా? ఛాన్సే లేదు! ఇవి పీఏ చేసిన సెటిల్మెంట్లు కావు, ముమ్మాటికీ జగన్ రెడ్డి స్వయంగా నడిపించిన దందా. గతంలో కాకినాడ పోర్టును బెదిరించి లాక్కునేందుకు ప్రయత్నించడం, తీవ్ర వివాదమై కోర్టుల వరకు వెళ్లేసరికి వెనక్కి తగ్గడం చూశాం. జగన్ రెడ్డి గనుక మరోసారి గెలిచి ఉంటే, ఆ పోర్టుతో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు పోర్టులను కూడా బలవంతంగా లాక్కుని రాసుకునేవారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రం మొత్తం మైనింగ్ మాఫియా తన గుప్పిట్లో పెట్టుకుని గనుల్ని కొల్లగొట్టింది. ఈ మాఫియా సెటిల్మెంట్లలో పోలీసు వ్యవస్థను కూడా భాగస్వామ్యులను చేశారు. ఉన్నత స్థాయి అధికారులను తమ అక్రమాలకు వాడుకుని, వారికి వాటాలు ఇచ్చి పోలీసుల చేత కూడా ఖాకీ మాఫియా నడిపించారు. దీనివల్లే ఇప్పుడు పలువురు ఐపీఎస్, పోలీస్ అధికారులు లూప్ లైన్లలో, కేసుల ఊబిలో ఇరుక్కుపోయారు. చివరికి అధికారం కోసం, అప్పుల కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వానికి ‘బైజూస్’ ట్యాబ్‌ల వ్యవహారమే నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నామంటూ, అంతర్జాతీయ సంస్థ బైజూస్ కు కొత్త సబ్స్క్రైబర్లు అవసరమనే కారణంతో ఏపీ విద్యార్థులందరినీ బలవంతంగా ఆ ఖాతాలో చేర్చారు. ఆ కంపెనీకి అప్పులు పుట్టడం కోసం, తెరవెనుక జరిగిన ముడుపుల లావాదేవీల కోసం వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును ఆ సంస్థకు ధారపోశారు. కానీ, చివరకు ఆ బైజూస్ దివాలా తీయడాన్ని ఎవరూ ఆపలేకపోయారు. విద్యార్థుల భవిష్యత్తును సైతం తాకట్టు పెట్టిన నీచమైన మాఫియా ఆలోచన ఇది.
దొంగే..దొంగా దొంగ అనే అరుపు
“తానే దొంగతనం చేసి, తానే ‘దొంగా దొంగా’ అని అరిచిన” వ్యవహారం జగన్ రెడ్డికి సరిపోతుంది. చేసినవన్నీ చేసి.. ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా ప్రభుత్వంపై బురద చల్లేస్తున్నారు. ఐ నాడు తాము చేసిన అక్రమాలు విచారణల రూపంలో మెడకు చుట్టుకుంటుండటంతో, తప్పును కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వంపై అడ్డగోలు నిందలు వేయడం ప్రారంభించారు. పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఏళ్ల తరబడి వేచి చూసిన నిరుద్యోగులను మోసం చేసిన చరిత్రను మరుగున పడేసి.. ఇప్పుడు తానేదో నిరుద్యోగ రక్షకుడిలా ఫోజులివ్వడం సమాజానికే పెనుశాపంగా మారింది. జగన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియ ఎంతటి ప్రహసనంగా మారిందో రాష్ట్రమంతా చూసింది. మెరిట్ ఉన్న అభ్యర్థులను పక్కనబెట్టి, తాడేపల్లి ప్యాలెస్ సిఫార్సులకు, కోట్ల రూపాయల చేతులు మారిన వ్యవహారాలకు పెద్దపీట వేశారనే ఆరోపణలు నాడు వెల్లువెత్తాయి. డిజిటల్ మూల్యాంకనంలో జరిగిన అక్రమాలు, ఒకే అభ్యర్థికి వేర్వేరు మార్కులు రావడం వంటి తారుమారు రాజకీయాలతో గ్రూప్-1 అభ్యర్థులు వీధిన పడ్డారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఉద్యోగాలను అంగడి సరుకులా అమ్ముకున్న జగన్ మార్క్ వ్యవహారంపై ఇప్పుడు లోతైన విచారణలు సాగుతున్నాయి. లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామంటూ జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఊదరగొట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియే ఒక పెద్ద బోగస్ వ్యవహారమని తేలిపోయింది. కనీస అర్హత మార్కులు లేని వారికి, వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల కార్యకర్తలకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు నిబంధనలను ఇష్టానుసారంగా మార్చేశారు. తాము అధికారంలో ఉండగా మెగా డీఎస్సీ అని ఊరించి, చివరికి నిరుద్యోగులకు మొండిచేయి చూపించిన జగన్ రెడ్డి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి చేసిన మెగా డీఎస్సీపై బురద చల్లడం అత్యంత హేయం. తప్పుడు ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రతో తాడేపల్లి సోషల్ మీడియా వింగ్‌ను రంగంలోకి దించారు. తప్పు తానే చేసి.. ఆ నిందను ప్రస్తుత ప్రభుత్వంపై నెట్టేసే ఈ దొంగే.. దొంగ అనే మనస్తత్వం కేవలం వ్యవస్థలను భ్రష్టు పట్టించడానికే ఉపయోగపడుతుంది. “అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడి.. ప్రతిపక్షంలోకి రాగానే బాధితుల ముసుగు వేసుకునే నాయకులను ప్రజాస్వామ్యం ఎప్పటికీ క్షమించదు.
ప్రజలు వేసే చరమాంకం శిక్ష!
జగన్ రెడ్డి వంద మందిలో పది లేదా పదిహేను మందికి నెలకు ఓ పదివేల రూపాయల బటన్ నొక్కి పడేసి.. ‘మీకు గొప్ప మేలు చేస్తున్నా’ అని భ్రమింపజేస్తూ ప్రజలను ముష్టివాళ్లను చేసే కుట్ర పన్నారు. ఒకవైపు ఘోరమైన సంపద దోపిడీ, మరోవైపు కక్ష సాధింపులతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఐదేళ్ల పాటు ఈ మాఫియా పాలనను భరించిన ఏపీ ప్రజలు ఎంత నష్టపోయారో ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తున్న సంచలన వివరాలు చూస్తేనే అర్థమవుతోంది. ఈ దర్యాప్తు సంస్థలు బయట పెట్టక ముందే ప్రజలు గుర్తించారు. అందుకే 11 సీట్లకు పరిమితం చేశారు. ఇలాంటి నేతలను మళ్లీ నమ్మితే భవిష్యత్తులో ప్రజల కిడ్నీలను కూడా అమ్మేస్తారనడంలో అతిశయోక్తి లేదు.
“అన్యాయంగా ఆర్జించిన సిరి, అక్రమంగా ఏలిన రాజ్యం.. తుఫాను ముందు దీపం లాంటివి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ఆఖరి శిక్ష.” ఇలాంటి మాఫియా శక్తులకు ప్రజలు వేసే శిక్ష కేవలం ఓటుతో ఓడించడమే కాదు.. వారు దోచుకున్న ప్రతి పైసాను విడిపించి, చట్టపరంగా వారిని బోనులో నిలబెట్టి, రాబోయే తరాలకు రాజకీయ దోపిడీ చేయాలంటేనే వణికిపోయేలాంటి శాశ్వత రాజకీయ సమాధి కట్టడమే నిజమైన శిక్ష. ప్రజా చైతన్యమే ఈ మాఫియా సామ్రాజ్యానికి చరమాంకం పాడాలి!
