పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ కి కోలుకోలేని విధంగా బిగ్ షాక్ ఇచ్చేందుకు సీఎం రమేష్ రెడీ అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీని చీల్చి, ఆ పార్టీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసే దిశగా ఒక భారీ రాజకీయం నడుస్తోంది. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన ఒక రహస్య భేటీతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సమావేశానికి టీఎంసీకి చెందిన పలువురు కీలక ఎంపీలు హాజరుకావడం దేశ రాజధానిలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
బెంగాల్ వేదికగా సాగుతున్న ఈ ఆపరేషన్ బెంగాల్ వెనుక బీజేపీ ఎంపీ, వ్యూహకర్త సీఎం రమేష్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తన మార్కు పొలిటికల్ మానిటరింగ్, మేనేజ్మెంట్ స్కిల్స్‌తో ఆయన ఈ ఆపరేషన్‌ను లీడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పలు కీలక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను దెబ్బకొట్టడంలో తెరవెనుక చక్రం తిప్పిన అనుభవమున్న సీఎం రమేష్.. ఇప్పుడు బెంగాల్ దీదీ పార్టీ పార్లమెంటరీ శ్రేణులను బీజేపీ వైపు తిప్పడంలో తన చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన పర్యవేక్షణలోనే టీఎంసీ ఎంపీలను సమన్వయం చేస్తూ ఈ విలీన ప్రక్రియను చివరి దశకు చేర్చినట్లు సమాచారం.
బెంగాల్ సీఎం సువేందు అధికారితో పాటు బీజేపీ నేతలతో దాదాపు 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో మమతా బెనర్జీ ఏకపక్ష నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్న ఈ ఎంపీలంతా కలిసి ఇవాళో, రేపో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను అధికారికంగా కలవడానికి సమయం కోరినట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. పార్లమెంట్లో తమకు తగినంత బలం ఉన్నందున, ఫిరాయింపుల నిరోధక చట్టం ముప్పు లేకుండా తమను ఒక ప్రత్యేక గ్రూప్‌గా పరిగణించాలని వారు స్పీకర్‌ను కోరనున్నట్లు సమాచారం.
సీఎం రమేష్ సెంట్రిక్‌గా సాగుతున్న ఈ పొలిటికల్ ఆపరేషన్ సక్సెస్ అయితే.. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి భారీ మైలేజ్ లభించడమే కాకుండా, పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం రమేష్ రాజకీయ వ్యూహాలపై మోదీ, షాలకు ప్రత్యేకమైన గురి ఉంది. ఇది సక్సెస్ అయితే ఆయన మైలేజ్ మరింత పెరగనుంది.


