తమన్ వచ్చిన తరవాత దేవిశ్రీ ప్రసాద్ స్పీడు కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఇద్దరి మధ్యా వృత్తిపరమైన పోటీ ఉంది. అయితే వ్యక్తిగతంగా ఇద్దరూ క్లోజ్. వీలున్నప్పుడల్లా దేవిశ్రీ ప్రస్తావన తీసుకొస్తుంటాడు తమన్. ఈసారీ అదే జరిగింది. తమన్ త్వరలో ఓ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. అందులో భాగంగా మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యాడు. ‘దేవిశ్రీ ప్రసాద్ హీరో అయ్యారు కదా. మీ వంతు ఎప్పుడు ?’ అని అడిగితే తమన్ ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు.
”నేనెప్పుడో బాయ్స్ టైమ్ లోనే హీరో అయిపోయాను. యాక్టింగ్ అనేది నా పని కాదు. అదో పెద్ద టార్చర్. హాయిగా ఏసీ రూముల్లో కూర్చుని ట్యూన్స్ చేసుకోక, నాకెందుకు ఎండ దెబ్బలు, వడదెబ్బలు” అని సరదాగా కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ కష్టాన్నీ ప్రస్తావించాడు. ”ఎల్లమ్మ కథ విన్నాను. ష్యూర్ షాట్ హిట్టది. దిల్ రాజు గారు ఈ సినిమా గురించి నాకు లక్ష సార్లు చెప్పారు. దేవి అన్న ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తున్నాడు. ఈ సినిమాలో వీలైతే నేనూ పాలు పంచుకొంటా. ఓ పాట చేస్తా అని దిల్ రాజు గారితో చెప్పాను. నాకు పని విషయంలో ఎలాంటి భేషజాలూ లేవు. అందరూ ఇక్కడ పని చేయడానికే వచ్చాం” అని చెప్పుకొచ్చాడు.
ఓ సంగీత దర్శకుడు హీరోగా చేస్తున్న సినిమాకు సంగీతం వహించడానికి తమన్ ముందుకొచ్చాడంటే గ్రేటే అనుకోవాలి. అలాంటి ప్రయత్నం చేస్తే.. తప్పకుండా ‘ఎల్లమ్మ’ చిత్రానికి అది అదనపు ఆకర్షణే అవుతుంది. మరి దిల్ రాజు, దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో చూడాలి.
నటన కష్టమని తమన్ చెబుతున్నాడు కానీ, ఓ తమిళ సినిమాలో తమన్ కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా త్వరలో విడుదల కానుంది.


