ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు లభిస్తోంది. జనసేనకు దక్కిన ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిగా ఎవరిని పంపాలనే దానిపై పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం జనసేన వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. రాజ్యసభ రేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు దాదాపు ఖరారైనట్లు బలంగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా కూటమి నేతలతో సత్సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా, పార్టీకి వివిధ రకాలుగా అండగా నిలిచిన ఆయన వైపే పవన్ కల్యాణ్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం ఆయన పేరుపై పవన్ అధికారిక ముద్ర వేసే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
అయితే, ఇదే సమయంలో గ్రీన్ కో గ్రూప్‌నకు చెందిన ఒక కీలక వ్యక్తి పేరు కూడా తెరపైకి రావడం జనసేన అంతర్గత వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న గ్రీన్ కో గ్రూప్ యాజమాన్యం మెగాస్టార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గ్రీన్ కో యాజమాన్యంలోని కీలక వ్యక్తికి రాజ్యసభ ఇవ్వాలన్న ఒత్తిడి పవన్ పై ఉంది. ఆయనకు ఇస్తే అటు పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసినట్లు ఉండటంతో పాటు, జాతీయ స్థాయిలో పార్టీకి వ్యూహాత్మకంగా కలిసి వస్తుందనే మరో ప్రతిపాదన కూడా పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఈ రెండు పేర్ల ఆర్థిక, సామాజిక సమీకరణాలను నిశితంగా పరిశీలించారు.
అయితే ఆయన ఇప్పుడు లింగమనేని వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. వచ్చే మూడేళ్ల కాలంలో మరో రెండు రాజ్యసభ సీట్లు జనసేనకు కేటాయిస్తారని అందులో నుంచి ఇప్పుడు రేసులో ఉన్న వారికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లుగా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. జనసేన అధినేత తీసుకునే తుది నిర్ణయం కోసం అటు తెలుగుదేశం, ఇటు బీజేపీ శ్రేణులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. జనసేన అభ్యర్థి గెలుపు ఏకగ్రీవం కావడం ఖాయం కాబట్టి, పవన్ కల్యాణ్ ఎంపిక చేసే వ్యక్తి ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జనసేన ఖరారు చేసే అభ్యర్థిని బట్టి టీడీపీలో అభ్యర్థుల్లో సామాజిక సమీకరణాలను చూసుకోనున్నారు.


