టీడీపీ తమ పార్టీ వార్షిక వేడుక మహానాడు పై విమర్శలు గుప్పించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. బుధవారం ఉదయం మహానాడు అధికారికంగా ప్రారంభమైన తొలి నిమిషం నుంచే తాడేపల్లి వేదికగా మొదలైన వైసీపీ విమర్శల పర్వం.. గురువారం రెండో రోజు కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. అయితే టీడీపీ చేస్తున్న తీర్మానాలపై గానీ, వారి విధానాలపై గానీ ఎలాంటి నిర్మాణాత్మకమైన విమర్శలు చేయలేక, కేవలం రాజకీయ ఉనికి కోసమే వైసీపీ నేతలు ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ రెండు రోజుల విమర్శల ప్రహసనంలో ఎక్కువ భాగం టీడీపీపై చేసే విమర్శల్లో రోజానే కనిపిస్తున్నారు. ప్రెస్ మీట్లలో ఆమె మాట్లాడుతున్న భాషా శైలి, విమర్శలు చూస్తుంటే.. కనీస సబ్జెక్ట్ లేకుండా కేవలం మహానాడు పూర్తిగా ఫ్లాప్ అయ్యింది.. అక్కడ ప్రజలు లేరు.. కూటమి నేతలు నిత్యం జగన్ మోహన్ రెడ్డి నామాన్నే జపిస్తున్నారు అంటూ పాత క్యాసెట్నే మళ్లీ మళ్లీ ప్లే చేస్తున్నట్లుగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సింది పోయి, ఇలాంటి రొటీన్ పొలిటికల్ డైలాగులతోనే కాలక్షేపం చేయడం వైసీపీ శ్రేణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది.
ప్రతి ఏటా టీడీపీ నిర్వహించే పండగను టార్గెట్ చేయడం వైసీపీకి ఒక అలవాటుగా మారిపోయింది తప్ప, అందులో ఎలాంటి రాజకీయ పరిణతి కనిపించడం లేదు. టీడీపీ ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేసుకుంటూంటే.. తాడేపల్లి పెద్దలు మాత్రం ప్రెస్ క్లబ్లు, టీవీ మైకుల ముందు కూర్చుని పాత నిందలనే కొత్తగా చెప్పాలని చూస్తున్నారు. ఈ తరహా రొటీన్, చప్పని విమర్శల వల్ల వైసీపీకి రాజకీయంగా ఎలాంటి మైలేజ్ రాకపోగా.. ప్రజల్లో వారి గ్రాఫ్ మరింత పడిపోయే ప్రమాదం ఉంది.
