పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. పదిహేనేళ్లకు పైగా అప్రతిహతంగా సాగిన తృణమూల్ కాంగ్రెస్ హవాకు ఈ ఓటమి గట్టి దెబ్బగా మారింది. అధికార పార్టీ నాలుగో స్థానానికి పడిపోవడం కేవలం ఒక ఓటమి మాత్రమే కాదు, బెంగాల్ రాజకీయాల్లో ఒక శకం ముగిసిందనడానికి సంకేతంగా మారింది.
భయం గుప్పిట్లో మమత సైన్యం!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు అనే సత్యాన్ని ఫాల్టా ఉప ఎన్నిక ఫలితం మరోసారి నిరూపించింది. ముప్పై ఏళ్ల లెఫ్ట్ కోటలను బద్దలు కొట్టి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్, ఇప్పుడు అదే స్థాయిలో పతనాన్ని మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన ఫాల్టాలో, ఇప్పుడు నాలుగో స్థానానికి పరిమితం కావడం టీఎంసీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజలను భయపెట్టి, వ్యవస్థలను గుప్పిట్లో ఉంచుకుని పరిపాలన సాగిస్తే.. ప్రజలు తిరగబడిన రోజు నిలువ నీడ కూడా ఉండదని ఈ ఫలితం స్పష్టం చేస్తోంది.
అండర్‌గ్రౌండ్‌కు పుష్పాలు .. నాయకత్వ శూన్యం!
ఎన్నికల సమయంలో పార్టీ కోసం మజిల్ పవర్ ప్రదర్శిస్తూ, విపక్షాలను అణచివేసిన తృణమూల్ కీలక నేతలు ఇప్పుడు కనిపించకుండా పోతున్నారు. ఎన్నికల ఫలితాలు రాగానే ఓటమిని తట్టుకోలేక చాలా మంది నేతలు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు లేదా ప్రత్యర్థి పార్టీలకు సరెండర్ అవుతున్నారు. పార్టీ కోసం వీధుల్లోకి వచ్చి పోరాడే కేడర్ ఇప్పుడు బెంగాల్లో కరువైపోయింది. అధికారం ఉన్నప్పుడు అనుభవించిన వారే తప్ప, ఆపదలో పార్టీని కాపాడే సైనికులు టీఎంసీకి మిగలలేదనేది ఈ ఉప ఎన్నికలో స్పష్టమైంది.
ఏకపక్షంగా బీజేపీ హవా!
ప్రస్తుతం బెంగాల్ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. టీఎంసీ బలహీనపడటంతో ఆ ఖాళీని బీజేపీ అత్యంత వేగంగా భర్తీ చేస్తోంది. ముస్లిం ఓట్ల పోలరైజేషన్ ఒకవైపు జరుగుతున్నా, మెజారిటీ ఓటర్లు ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. గెలిచిన బీజేపీ కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తృణమూల్ అనుసరించిన భయపెట్టి పాలించే పద్ధతినే తాము కూడా అవలంబిస్తే, బెంగాల్ ప్రజలు మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవడానికి ఎంతో కాలం పట్టదు. హింసాత్మక రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రజల్లో భరోసా నింపినప్పుడే ఈ విజయం చిరకాలం నిలుస్తుంది. రాజకీయ నేతలు గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక సూత్రం ఏమిటంటే.. అధికారం అనేది ప్రజలు ఇచ్చే బాధ్యత తప్ప, అది శాశ్వత ఆస్తి కాదు.
టీఎంసీకి ఇది చరమగీతమా?
ఫాల్టా ఉప ఎన్నిక ఫలితం తృణమూల్ కాంగ్రెస్‌కు ఒక హెచ్చరిక మాత్రమే కాదు, అది ఆ పార్టీ పతనానికి నాంది అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సొంత కేడర్‌ను కాపాడుకోలేక, ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన తరుణంలో మమతా బెనర్జీ తన రాజకీయ వ్యూహాలను మార్చుకుంటారా? లేక ఈ పతనం ఇలాగే కొనసాగుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి. ఆమె కంటే ఆమె వారసుడు అభిషేక్ బెనర్జీపై అటు ప్రజల్లో.. ఇటు పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉంది.
