పశ్చిమాసియా లో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తూ తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌తో నెలకొన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు అమెరికా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. తాము విధించిన షరతులకు ఇరాన్ పూర్తిగా లొంగిపోవాలని, అమెరికా చెప్పినట్లే ఒప్పందం కుదుర్చుకోవాలనే ఏకపక్ష పట్టుదలతో ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్‌పై ఒత్తిడిని మరింత పెంచే వ్యూహంలో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ సైనిక స్థావరాలు, వ్యూహాత్మక కేంద్రాలపై భారీగా వైమానిక దాడులకు దిగాయి.
తిరగబడ్డ ఇరాన్.. ప్రతీకార దాడుల పరంపర!
అమెరికా వైపు నుంచి ముంచుకొస్తున్న ఈ కఠిన సైనిక చర్యలకు ఇరాన్ సైతం అంతే దీటుగా ప్రతిస్పందిస్తూ ప్రతీకార దాడులు ప్రారంభించింది. అమెరికా బలగాలే లక్ష్యంగా వందలాది డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ ఇరాన్ సరిహద్దుల్లో యుద్ధాన్ని మరింత ఉధృతం చేసింది. అయితే, ఈ సైనిక సమరంలో ఇరాన్ తీసుకుంటున్న ప్రతీకార చర్యల వల్ల నేరుగా అమెరికా కంటే.. గల్ఫ్ ప్రాంతంలోని అరబ్ దేశాలే తీవ్రంగా నష్టపోతున్నాయి. అమెరికాకు మిత్రదేశాలుగా ఉంటూ, వారి సైనిక స్థావరాలకు ఆశ్రయమిస్తున్నాయనే నెపంతో ఇరాన్ తన దాడుల రూట్‌ను గల్ఫ్ దేశాల వైపు మళ్లించడమే ఇందుకు ప్రధాన కారణం.
గల్ఫ్ దేశాలపైనే ఇరాన్ క్షిపణుల వర్షం!
ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లు ఎక్కువగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , కువైట్, బహ్రెయిన్, ఖతార్ వంటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల భూభాగాలపైనే పడుతున్నాయి. ఈ దేశాల పరిధిలోని చమురు రవాణా నౌకలు, పారిశ్రామిక కేంద్రాలు, విద్యుత్ గ్రిడ్లు , మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇరాన్ వేల సంఖ్యలో దాడులు చేస్తుండటంతో గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి వచ్చింది. ఎంతో ప్రశాంతంగా, ఆర్థికంగా దూసుకుపోతున్న గల్ఫ్ నగరాల్లో సైరన్లు మోగడం, విమాన సర్వీసులు నిలిచిపోవడం వంటి పరిణామాలు అక్కడి పర్యటక, రియల్ ఎస్టేట్ రంగాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి.
గల్ఫ్ దేశాల మనుగడకే ముప్పు?
డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన అమెరికా ఫస్ట్ , నౌకాదళ దిగ్బంధన విధానాలు, గల్ఫ్ దేశాల పతనాన్ని చూసేంత వరకు ఆగేలా లేవనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అమెరికా తెచ్చిపెట్టిన ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల ప్రధాన ఆదాయ వనరైన పెట్రోలియం పరిశ్రమలు, చమురు రవాణా మార్గాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. అమెరికా రక్షణ కల్పిస్తామని చెబుతున్నప్పటికీ, ఈ సుదీర్ఘ కోల్డ్ వార్ వల్ల గల్ఫ్ దేశాల దశాబ్దాల అభివృద్ధి శూన్యమయ్యే ప్రమాదం పొంచి ఉందని, ట్రంప్ తన మొండివైఖరి వీడి దౌత్యపరమైన చర్చలు జరపకపోతే మిడిల్ ఈస్ట్ కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
