తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలికిన టీవీకే ప్రభుత్వం ఇప్పుడు ఒక విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. ప్రజల కోసం పాలన కంటే సోషల్ మీడియా కోసం ప్రచారం అనే ధోరణి ఆ పార్టీ మంత్రుల్లో పెరిగిపోతోందన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రతి చిన్న విషయాన్ని రీల్ గా మలచి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో వైరల్ చేయాలనే తాపత్రయం, క్షేత్రస్థాయిలో పాలనను పక్కదారి పట్టిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విజయ్ ప్రభుత్వాన్ని నెటిజన్లు ‘రీల్స్ ప్రభుత్వం’ అని పిలిచే పరిస్థితి వచ్చింది.
ప్రచార ఆర్భాటం.. పని తక్కువ!
ఇటీవల కాలంలో కొందరు మంత్రులు చేస్తున్న పనులు నవ్వులపాలు కావడమే కాకుండా ప్రభుత్వానికి నెగెటివ్ ఇమేజ్ తెస్తున్నాయి. ఉదాహరణకు, దేవాదాయ శాఖ మంత్రి ఆలయ ప్రసాదం కౌంటర్‌కు వెళ్లి ఎక్స్పైరీ డేట్ లేదని ప్రశ్నించడం, దాన్ని ఒక ఎలివేషన్ వీడియోలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. అలాగే, ఆసుపత్రుల తనిఖీలకు వెళ్లిన మంత్రులు రోగుల కష్టాలను తీర్చడం కంటే, కెమెరా యాంగిల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే ప్రచారానికి, అధికారంలో ఉండి చేసే పనికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని టీవీకే సోషల్ మీడియా వింగ్ ఇంకా గ్రహించినట్లు లేదు.
సచివాలయంలోనూ అదే ధోరణి!
కేవలం మంత్రులే కాకుండా, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ ఈ రీల్స్ సంస్కృతి చొరబడటం కలకలం రేపుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి విజయ్ సచివాలయంలో వికలాంగులతో జరిపిన సమావేశాన్ని కూడా ఒక సామాజిక కార్యకర్త రీల్ గా చిత్రీకరించి పోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది. ప్రభుత్వ అంతర్గత చర్చలు, అధికారిక సమావేశాలు కూడా పబ్లిసిటీ స్టంట్లుగా మారిపోతున్నాయని, ఇది ప్రభుత్వ హుందాతనాన్ని దెబ్బతీస్తోందన్న హెచ్చరికలు వస్తున్నాయి. వలం ఇన్స్టాగ్రామ్ లైక్ ల కోసం పాలనను తాకట్టు పెట్టవద్దని హితవు పలుకుతున్నారు.
ప్రజల్లో పెరుగుతున్న విరక్తి
నాయకులు మాట్లాడటం కాదు, పని మాట్లాడాలి అని ఓటరు కోరుకుంటున్నాడు. అయితే, టీవీకే మంత్రులు ఇస్తున్న ఎలివేషన్ వీడియోలు, డ్రోన్ షాట్లతో కూడిన తనిఖీలు ప్రజల్లో అతి అనే భావనను కలిగిస్తున్నాయి. అటు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా ఇది ఇది రీల్స్ ప్రభుత్వం అని పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ల ప్రస్తుతానికి ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులే కావడంతో ఈ రీల్స్ హడావుడి సాగుతోంది. కానీ ఇదే ధోరణి కొనసాగితే, ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకం త్వరగానే సడలిపోయే ప్రమాదం ఉంది.
