పాలమూరు బిడ్డను అని రేవంత్ రెడ్డి ఎప్పుడు వెళ్లినా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన పాలమూరg ప్రాజెక్టులన్ని పూర్తి చేసి చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ రెండున్నరేళ్లు అవుతున్నా అనుకున్నవిధంగా పురోగతి లేదన్న విమర్శలు వస్తున్నాయి.
పాలమూరు సమస్యలకు ఫలితాలు చూపించాల్సిందే
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడమే తన ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. అయితే, మా హయాంలో 90 శాతం పనులు పూర్తయినా, కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులను కావాలనే జాప్యం చేస్తోంది అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కల్వకుర్తి, భీమా ప్రాజెక్టుల కాల్వల మరమ్మతులు, పెండింగ్ ఉన్న భూసేకరణ పనులపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి తన పట్టును నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రేవంత్ రెడ్డిపై ఉంది. దశాబ్దాలుగా పాలమూరును వేధిస్తున్న ‘వలసల’ సమస్య ఇప్పుడు రాజకీయ ఆయుధంగా మారింది. వలసలను ఆపాలంటే కేవలం సాగునీరు మాత్రమే సరిపోదని, పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఫార్మా సిటీ తరలింపు, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా నిధుల కేటాయింపు వంటి చర్యలు చేపట్టారు.
పురోగతి లేదని విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావులకు చెక్ పెట్టాలంటే వారి నీటిపారుదల ప్రాజెక్టుల క్రెడిట్‌ను తగ్గించి, తనదైన శైలిలో కొత్త మార్పులు తీసుకురావాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ హబ్‌లను కేటాయించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని చూస్తున్నారు. ఒకవేళ ఈ రెండు మూడేళ్లలో వలసల శాతం తగ్గితే, అది రేవంత్ రెడ్డికి రాజకీయంగా అతిపెద్ద విజయమవుతుంది. లేదంటే ప్రతిపక్షాల విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రమాదం ఉంది.
సొంత కోటలో పట్టు కోసం ఆరాటం
ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతా తిరుగుతున్నప్పటికీ, రేవంత్ తన సొంత నియోజకవర్గం కొడంగల్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని మిగిలిన సీట్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో కూడా పాలమూరు నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. పాలమూరు పౌరుషం అనే నినాదంతో సామాజిక సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పాలమూరు అభివృద్ధి అనేది రేవంత్ రెడ్డికి కేవలం ఒక హామీ మాత్రమే కాదు, అది ఆయన ప్రతిష్ఠాత్మక సవాలు. పెండింగ్ ప్రాజెక్టులను పరుగులు పెట్టించి, వలసల ముద్రను తుడిచేయగలిగితేనే రేవంత్ తన సొంత జిల్లాలో తిరుగులేని నాయకుడిగా అవతరిస్తారు.
