రాజకీయాల్లో ‘కక్కుర్తి’ పడితే కాటికి కాకపోయినా.. కనీసం పోలీస్ స్టేషన్ దాకైనా లాగుతుందనడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారమే తాజా ఉదాహరణ. గత ఎన్నికల సమయంలో పోలీసులు ఎనిమిదిన్నర కోట్ల రూపాయల భారీ నగదును పట్టుకుంటే.. అప్పట్లో ఈ సొమ్ము మొత్తం తెలుగుదేశం పార్టీ దేనంటూ చెవిరెడ్డి అండ్ కో నానా యాగి చేశారు. తీరా ఎన్నికలు ముగిసి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆ నోట్ల కట్టలపై చెవిరెడ్డి కి మళ్లీ ‘ప్రేమ’ పుట్టుకొచ్చింది. ఎలాగైనా ఆ రూ. 8.5 కోట్లను వెనక్కి తెచ్చుకుందామనే అత్యాశతో ఒక అద్భుతమైన బినామీ డ్రామాకు తెరలేపారు.
ఈ కథలోకి ప్రద్యుమ్న అనే ఒక సరికొత్త పాత్రను రంగంలోకి దించి, ‘ఆ ఎనిమిదిన్నర కోట్లు నావే సార్.. పొరపాటున దొరికిపోయాయి’ అంటూ అతనితో ఒక అధికారిక లేఖ రాయించారు. ఈ మాస్టర్ ప్లాన్‌తో డబ్బులు వెనక్కి వస్తాయని చెవిరెడ్డి మురిసిపోయేలోపే సీన్ రివర్స్ అయింది. ఆ డబ్బు లిక్కర్ స్కామ్ లోనివని తేలడంతో దర్యాప్తు సంస్థలు “అంత సొమ్ము నీకు ఎక్కడిది? బ్యాంక్ స్టేట్మెంట్లు, ఐటీ రిటర్న్స్ ఆధారాలతో సహా విచారణకు హాజరుకావాలి” అంటూ ప్రద్యుమ్నకు గట్టిగా నోటీసులు జారీ చేశాయి.
అసలే బినామీ.. అందులోనూ అంత సీన్ లేని వ్యక్తి కావడంతో, ప్రద్యుమ్నకు అసలు కథ అప్పుడర్థమైంది. నోటీసులు చూసి గుండె గుభేల్ మనడంతో.. విచారణకు రాకుండా తప్పించుకునేందుకు రకరకాల వంకలు వెతకడం ప్రారంభించాడు. మొదట్లో ‘ఒంట్లో బాగోలేదు బాబోయ్’ అంటూ మెసేజ్‌లు పంపిన సదరు బినామీ గారు.. పోలీసులు మరింత ఒత్తిడి పెంచేసరికి క్లైమాక్స్‌లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. తన మానసిక ఆరోగ్యం దెబ్బతిందని ప్రస్తుతం మానసిక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని సరికొత్త సమాచారం పంపడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద జోక్‌గా మారింది.
నిజానికి ఆ ప్రద్యుమ్న గనుక విచారణకు వస్తే.. ఆ కోట్లాది రూపాయల వెనుక ఉన్న అసలు సూత్రధారి చెవిరెడ్డేనని, ఆ డబ్బు ఆయన బినామీ అకౌంట్లలోదేనని ఇట్టే తేలిపోతుంది. అందుకే ఆయనను రాకుండా వెనక ఉండి నడిపిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఎన్నికలప్పుడు ప్రత్యర్థులపై బురద జల్లడానికి వాడిన డబ్బే.. ఇప్పుడు తిరిగి సొంతం చేసుకుందామనే సరికి మెడకు పామై చుట్టుకుంది. నాడు టిడిపి డబ్బు అన్న నోటితోనే, నేడు మా బినామీ డబ్బు అని నిరూపించలేక, ఇటు డబ్బులు రాక.. అటు లీగల్ కేసుల నుంచి తప్పించుకోలేక చెవిరెడ్డి ఇప్పుడు నిండా మునిగిపోయారు. ఎన్నో రోజులు తప్పించుకోలేరని తెలిసి కూడా.. నాటకాలాడుతున్నారు.
