భారత జాతీయ రాజకీయాల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శైలి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన చర్చకు దారితీస్తూనే ఉంటుంది. ఇటీవల ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు, జోస్యాలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా.. ఏకంగా దేశంలోని అత్యున్నత రాజ్యాంగ, చట్టబద్ధమైన వ్యవస్థలను వివాదాల్లోకి లాగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల నుంచి మొదలుకొని న్యాయవ్యవస్థలోని కీలక వ్యక్తుల వరకు అంతా తనతో టచ్‌లో ఉన్నారని, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదిలోనే కూలిపోతుందంటూ ఆయన చెబుతున్న మాటలు రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. దీనికి తోడు ప్రధాని మోదీ, అమిత్ షా దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ విధించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటూ ఆయన చేస్తున్న ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టచ్‌లో ఉంటే ఎవరైనా చెప్పుకుంటారా?
ఏ ఒక్క బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత కూడా దేశంలోని స్వతంత్ర వ్యవస్థల ప్రముఖులు న్యాయమూర్తులు, ఎన్నికల కమిషనర్లు తనతో రహస్యంగా ‘టచ్’ లో ఉన్నారని బహిరంగంగా చెప్పుకోరు. ఎందుకంటే, ఆయా వ్యవస్థల నిష్పాక్షికతను, గోప్యతను కాపాడటం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం. కానీ వారిపైనే రాజకీయం చేస్తున్నారు రాహుల్. ఎవరైనా టచ్‌లో ఉన్నా..చెప్పుకోరు. ఎందుకంటే తనకు సమాచారం ఇస్తున్న వారిని ఆయన జాగ్రత్తగా కాపాడుకుంటారు. కానీ ఇక్కడ రాహుల్ చెబుతున్నారంటే అర్థం ఎవరూ లేరని. ఆయా వ్యవస్థల్లోని ప్రముఖులపై ప్రస్తుత ప్రభుత్వానికి నమ్మకం కోల్పోయేలా చేయడమే రాహుల్ గాంధీ ప్రధాన వ్యూహం. ప్రభుత్వ పెద్దల్లో అంతర్గతంగా అనుమానాలు రేకెత్తించి, వ్యవస్థలను బలహీనపరచాలనే ఈ మైండ్ గేమ్ అంతిమంగా రాహుల్‌కే రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది.
వ్యవస్థలపై అపనమ్మకం కలిగించడమే రాహుల్ లక్ష్యం
రాహుల్ గాంధీ అనుసరిస్తున్న ఈ సరికొత్త పంథా వెనుక ఒక నిర్దిష్టమైన సైకలాజికల్ వార్ఫేర్ కనిపిస్తోంది. నిరంతరం వ్యవస్థలపై నిఘా ఉందనే భ్రమను కల్పించడం ద్వారా, ప్రభుత్వ యంత్రాంగంలో ఒకరకమైన అభద్రతా భావాన్ని సృష్టించాలని కాంగ్రెస్ ఐటీ సెల్ , థింక్ ట్యాంక్ భావిస్తుండవచ్చు. అయితే, ఈ వ్యూహం క్షేత్రస్థాయిలో సామాన్య ఓటర్లకు తప్పుడు సంకేతాలను పంపుతోంది. దేశంలోని కోర్టులు, ఎన్నికల సంఘం వంటి పవిత్రమైన వ్యవస్థలు కూడా రాజకీయ పక్షాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నాయనే భావన ప్రజల్లో కలిగించడం వల్ల ప్రజాస్వామ్య పునాదులకే ముప్పు వాటిల్లుతుంది.
దేశంలో అస్థిరత సృష్టించడం కోసమే ప్లాన్లు
ఇక మోదీ-షా ద్వయంపై ‘ఎమర్జెన్సీ’ ఆరోపణలు చేయడం ద్వారా భయాందోళనలను రేకెత్తించి రాజకీయ మైలేజ్ పొందాలని చూడటం కూడా పాత పద్ధతిగానే కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ హయాంలోనే దేశం అసలైన అత్యవసర పరిస్థితిని రుచి చూసిందనే చారిత్రక సత్యాన్ని ప్రజలు మర్చిపోలేదని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రాహుల్ గాంధీ.. వ్యవస్థలను వివాదాల్లోకి నెట్టే ఇలాంటి చౌకబారు ప్రచారాలను నమ్ముకుంటే, ఆయన ఇంకా ప్రాథమిక రాజకీయ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే భావన వ్యక్తమవుతోంది. కేవలం అపనమ్మకాలను సృష్టించడం ద్వారా కాకుండా, నిర్మాణాత్మకమైన విధానాలతో, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడే ప్రతిపక్ష నేతగా ఆయనకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు, గౌరవం లభిస్తాయనేది అందరి అభిప్రాయం.
