హైదరాబాద్ వేదికగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ, ఆపై కాంగ్రెస్ మంత్రులు-నేతలు సాగించిన అగ్రెసివ్ ఎటాక్‌తో ఒక్కసారిగా వేడెక్కిన తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఊహించని మలుపు తీసుకుంది. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ అధిష్టానం నుండి గట్టి బ్రేకులు పడినట్లు తెలుస్తోంది.
సెల్ఫ్ గోల్ అవుతోందని గ్రహించిన అధిష్టానం
పవన్ కల్యాణ్‌ను తెలంగాణ వ్యతిరేకి గా ప్రొజెక్ట్ చేసి, సెంటిమెంట్‌ను రగిల్చే వ్యూహంతో కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వంటి వారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే, ఈ దూకుడు కాంగ్రెస్‌కే రివర్స్ అవుతోందని, పవన్‌ను ఎంతగా టార్గెట్ చేస్తే ఆయన అంతగా తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారని ఢిల్లీ పెద్దలు గుర్తించారు. పవన్‌ను విమర్శించడం ద్వారా లేనిపోని పొలిటికల్ మైలేజ్‌ను ఆయన చేతుల్లో పెడుతున్నామని, దీనివల్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆంధ్రా సెటిలర్ల ఓటు బ్యాంక్ కాంగ్రెస్‌కు పూర్తిగా దూరం అయ్యే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించడంతో హైకమాండ్ తక్షణమే అలర్ట్ అయింది.
బీఆర్ఎస్ – జనసేన ట్రాప్‌లో పడకుండా జాగ్రత్త
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి రేవంత్ రెడ్డి మార్క్ సెంటిమెంట్ పాలిటిక్స్ వాడుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ చాలా చాకచక్యంగా పవన్‌తో బ్రదర్లీ రిలేషన్ అంటూ సాఫ్ట్ స్టాన్స్ తీసుకున్నారు. కాంగ్రెస్ ఎంతగా పవన్‌పై దాడి చేస్తే.. పవన్ అంతగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే తిరకాసును హైకమాండ్ పసిగట్టింది. భవిష్యత్తులో బీజేపీ + బీఆర్ఎస్ + జనసేన కలిసి కూటమి కట్టే ప్రక్రియకు కాంగ్రెస్ వైఖరే కారణం కాకూడదనే ఉద్దేశంతోనే, ఆ ఇష్యూను ఇక లైట్ తీసుకోండి అని ఢిల్లీ నుండి ఆర్డర్స్ వచ్చాయి. యని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావించింది.
ఫోకస్ మార్చమన్న ఢిల్లీ – ప్రజా సమస్యలపైనే చర్చ
అధిష్టానం ఆదేశాల ప్రకారం.. ఇకపై పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించకుండా, కేవలం తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి గ్యారంటీల అమలుపైనే మంత్రులు మాట్లాడాలని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఎంట్రీని కాంగ్రెస్ నేతలు అడ్డుకోజూడటం వల్ల ఆయనకు ఒక పొలిటికల్ విక్టిమ్ కార్డ్ దొరికినట్లయింది. దీన్ని మరింత సాగదీస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అందుకే, ఈ వివాదాన్ని ఇక్కడితో క్లోజ్ చేసి, కేడర్ మొత్తాన్ని డైవర్ట్ చేయాలని ఆదేశించారు.
రాజకీయాల్లో ఒక్కోసారి మౌనం అనేది అగ్రెసివ్ అటాక్ కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. పవన్ కల్యాణ్ ఇష్యూలో కాంగ్రెస్ శృతిమించి ప్రదర్శించిన ఆవేశం సెల్ఫ్ గోల్‌గా మారుతోందని ఢిల్లీ పెద్దలు సకాలంలో గుర్తించి బ్రేకులు వేయడం ఒక రకంగా రేవంత్ సర్కారుకు మేలు చేసేదే. మరి హైకమాండ్ ఆదేశాల తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ ఊసెత్తకుండా సైలెంట్ అవుతారా.. లేక లోకల్ లీడర్లు మళ్లీ లైన్ దాటుతారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.
