ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న సమీకరణాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు గులాబీ కోటగా విరాజిల్లిన ఈ జిల్లాలో ఇప్పుడు కారు వేగం తగ్గగా, బీజేపీ , కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. గతంలో 33 స్థానాలతో ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్, గత ఎన్నికల్లో కేవలం 9 స్థానాలకే రిమితమై భారీ పతనాన్ని చవిచూసింది. మరోవైపు, బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ 30 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. స్వతంత్రుల మద్దతుతో బీజేపీ అభ్యర్థి మేయర్ పీఠాన్ని అధిష్టించారు. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో సున్నా నుంచి ఇప్పుడు 14 స్థానాలకు చేరుకుని, నగరంలో తన ఉనికిని చాటుకుంది. ఇప్పుడు నగరంపై పట్టు కోసం బండి సంజయ్ వర్గం, అధికార కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోరు సాగుతోంది.
సిరిసిల్లలో కేటీఆర్ పట్టు కోల్పోతున్నారా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల లో కూడా రాజకీయం వేడెక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అక్కడ సమీకరణాలు మారినట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండటం, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగాల్సి రావడం ఆయన పట్టు సడలుతోందనే చర్చకు దారితీసింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నల సమస్యలపై ఫోకస్ పెట్టడం కేటీఆర్‌కు సవాలుగా మారింది.
బండి సంజయ్ మార్క్ పాలిటిక్స్
కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ బండి సంజయ్ తన పూర్తి ఫోకస్‌ను కరీంనగర్‌పైనే ఉంచారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంలో ఆయన వ్యూహాలు ఫలించాయి. బీఆర్ఎస్ ఎంతగా వ్యతిరేక ప్రచారం చేసినా, బండి సంజయ్ తన పట్టును నిరూపించుకున్నారు. కాలంలో జిల్లా మొత్తం కాషాయమయం అవుతుంది అని ఆయన శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
అధికార బలంతో కాంగ్రెస్ దూకుడు
రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేషన్ సీట్లను సాధించడమే కాకుండా, బీఆర్ఎస్ ముఖ్య నేతలను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా గులాబీ కోటను బీటలు వారుస్తోంది. ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జిల్లాలో కాంగ్రెస్‌ను నంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని చూస్తున్నారు. మొత్తానికి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ తన పాత వైభవాన్ని కోల్పోతుండగా, బీజేపీ – కాంగ్రెస్ మధ్య రాజకీయ వార్ క్లైమాక్స్‌కు చేరుకుంది. సిరిసిల్లలో కేటీఆర్ తన కోటను కాపాడుకుంటారా? లేదా బండి సంజయ్ దూకుడుకు మరిన్ని స్థానాలను కోల్పోతారా? అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది.
