హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేట మైత్రీవనం కూడలి వద్ద తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన పనులు తుది దశకు చేరుకున్నాయి. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అనుమతులు ఇచ్చి మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆవిష్కరించేందుకు సిద్ధం చేసింది. అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ దీనిపై తీవ్ర వ్యతిరేక ప్రచారం ప్రారంభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం తెలంగాణ అస్తిత్వంపై దాడి అన్నట్లుగా వారు చేస్తున్న ప్రచారం సాధారణ ప్రజలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఎదిగింది స్వయంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే. కేసీఆర్ తానే స్వయంగా ఎన్టీఆర్‌కు నమ్మకమైన శిష్యుడినని అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. సుదీర్ఘ కాలం సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ ఆంధ్రప్రాంత వలస పాలకులను, ఆంధ్రా నేతలను తీవ్రస్థాయిలో విమర్శించినప్పటికీ.. ఎన్టీఆర్ పేరును ఎప్పుడూ గౌరవంగానే ప్రస్తావించారు తప్ప ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఖమ్మం, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఎన్టీఆర్ జపం చేస్తూ ఓట్లు అడిగే బీఆర్ఎస్.. ఇప్పుడు కేవలం రాజకీయ సంకుచితత్వంతో ఎన్టీఆర్ విగ్రహంపై సోషల్ మీడియాలో విషం చిమ్మడం ద్వంద్వ విధానాలకు నిదర్శనంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు అంత తేలికగా మర్చిపోయేవి కావు. శతాబ్దాలుగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో సాగిన పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, వెనుకబడిన వర్గాలకు అణచివేత నుంచి విముక్తి ప్రసాదించింది ఎన్టీఆరే. నేడు తెలంగాణ రాజకీయాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలు శాసనసభకు వెళ్తున్నాయన్నా, రాజ్యాధికారంలో సమాన భాగస్వామ్యం పంచుకుంటున్నాయన్నా.. దానికి ఆనాడు ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో తెచ్చిన విప్లవాత్మక రిజర్వేషన్లే మూలకారణం. రూ.2 కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాల వంటి సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో నిలిచిన ఒక మహానాయకుడిని, కేవలం ఆంధ్రప్రాంతానికి చెందిన నేతగా ముద్ర వేసి ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ప్రయత్నించడం వారి అపరిపక్వతను చూపిస్తోంది.
ఎన్టీఆర్ విగ్రహంపై బీఆర్ఎస్ వ్యతిరేకత -అదే స్టాండ్‌పై ఉండగలరా
ఈ తరహా వ్యతిరేక ప్రచారం’ బీఆర్ఎస్కే తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంధ్ర ఓటర్లతో పాటు, ఎన్టీఆర్ సంస్కరణల వల్ల లబ్ధి పొందిన లక్షలాది మంది తెలంగాణ బడుగు బలహీన వర్గాల ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఐటీ మౌలిక వసతుల బీజం వేసింది ఎన్టీఆర్ హయాంలోనే అన్నది చారిత్రక సత్యం. ఇక ముందు కూడా అదే్ స్టాండ్ పై ఉండాలనుకుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా కాకుండా.. ఆ పార్టీ అగ్రనేతలే నేరుగా చెబితే ప్రజలకు క్లారిటీ వస్తుంది.


