తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రీజినల్ కో-ఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో జరిగిన సార్ క్లాస్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన పొలిటికల్ ఫిలాసఫీ విన్నాక.. వైఎస్సార్సీపీ సీనియర్ లీడర్ల బుర్రలు పూర్తిగా హీటెక్కిపోయాయి. సాధారణంగా ఓటర్ల లిస్ట్ సవరణ అంటే.. దొంగ ఓట్లను, తప్పుడు ఓట్లను ఏరిపారేయాలని, మన అసలైన ఓట్లు పోకుండా చూసుకోవాలని ఏ లీడరైనా క్యాడర్‌కు చెబుతారు. కానీ, మన తాడేపల్లి రాజకీయ మేధావి మాత్రం క్లాస్ రూమ్‌లో అసలు ఎవరికీ అర్థం కాని సరికొత్త ఓట్ల సిద్ధాంతా ’ తెరపైకి తెచ్చి సొంత పార్టీ నేతలకే తీరని తలనొప్పి తెచ్చిపెట్టారు.
సమావేశంలో జగన్ రెడ్డి చెప్పిన లెక్కల సారాంశం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఓట్లు పెరిగాయి కాబట్టే మనం దారుణంగా ఓడిపోయాం. అదే సమయంలో బెంగాల్, తమిళనాడులో ఓట్లు తీసేశారు కాబట్టే అక్కడ తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలు ఓడిపోయాయట. మొత్తం మీద ఓట్లు తగ్గించినా డేంజరే, పెంచినా డేంజరేనని ఆయన సెలవిచ్చారు. ఈ వింత విశ్లేషణ విన్న పక్కన ఉన్న లీడర్లకు ఒకటే డౌట్.. మరి ఇప్పుడు ఓట్లను పెంచాలా? తగ్గించాలా? లేక ఉన్నవి ఉన్నట్లుగా చూస్తూ ఊరుకోవాలా? అని. ఒకవేళ ఉన్నవి ఉన్నట్లుగా వదిలేస్తే.. కూటమి దెబ్బకు వచ్చే ఎన్నికల్లో ఉన్న 11 సీట్లు కూడా గోవిందా అవ్వడం ఖాయమని లోపల లోపల తెగ మదనపడిపోతున్నారు.
అసలు ఈ క్లాస్‌లో అన్నింటికంటే పెద్ద హైలైట్ ఏంటంటే.. ఈ సార్ ప్రక్రియపై సుదీర్ఘమైన సవరణల చిట్టాను, సాంకేతిక విషయాలను జగన్ రెడ్డి స్వయంగా చదివి చెబితే బాగుండేది. కానీ, ఆయనకేమీ తెలియనట్లు, అసలు ఆ సబ్జెక్టుతో తనకు సంబంధం లేనట్లు.. మైక్ తీసుకెళ్లి పక్కనే ఉన్న కురసాల కన్నబాబు చేతిలో పెట్టారు. కన్నబాబు పాపం క్లాస్ రూమ్ లెక్చరర్‌లాగా ఆ పిడిఎఫ్ ప్రతులను చదువుతుంటే.. మన అధినేత పక్కన కూర్చుని.. “యా.. యా.. కరెక్ట్.. అలాగే చెయాలి..” అంటూ తల ఊపుతూ టైంపాస్ చేయడం చూసి సమావేశానికి వచ్చిన లీడర్లు ముక్కున వేలేసుకున్నారు.
గ్రౌండ్లోకి వెళ్లాల్సింది పోయి తాడేపల్లిలో ఎప్పుడో ఓ సారి ఇలాంటి గందరగోళ సిద్ధాంతాలతో, తల ఊపుడు ప్రోగ్రామ్‌లతో కాలక్షేపం చేయడంపై వైఎస్సార్సీపీ నేతల్లోనే అంతర్గతంగా అసహ్యం వ్యక్తమవుతోంది.
