పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక పండుగ మహానాడు ఆఫ్‌లైన్, ఆన్లైన్ కలయికతో సరికొత్త హైబ్రిడ్ మోడల్ లో అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. పసుపు సైన్యం కాలర్ ఎగరేసి గర్వంగా జరుపుకునే ఈ పసుపు పండుగ ఉత్సాహంగా సాగుతోంది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేదికపై యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సరికొత్త రాజకీయ శకానికి నాంది పలుకుతూ ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంట్లో మహిళా బిల్లుతో సంబంధం లేకుండా, 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. “ఇది మా సంకల్పం.. మా బాధ్యత.. మా కమిట్మెంట్” అంటూ లోకేష్ చేసిన ప్రకటనతో మహానాడు వేదిక జయధ్వానాలతో మారుమోగింది.
టీమ్ 11కి బ్యాటింగ్ తప్పదు!
మహానాడు ప్రారంభోపన్యాసంలో యువనేత లోకేష్ వైసీపీ టీమ్ 11 లక్ష్యంగా వాడి వేడి సెటైర్లు, పవర్ఫుల్ కౌంటర్లతో విరుచుకుపడ్డారు. మహానాడును హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నామని తెలియగానే అవతలి వైపు ఉన్న టీమ్ 11 సంబరాలు చేసుకుందంట.. కానీ ఆఫ్‌లైన్ అయినా, హైబ్రిడ్ అయినా సైకో రౌడీలకు బ్యాటింగ్ తప్పదు అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సాగిన గొడ్డలి రాజకీయాన్ని, బాబాయ్ హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. మాది గూగుల్ – మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్ – మీది ఫ్యాక్షన్, మాది కియా – మీది కిడ్నాప్ అంటూ మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్న జగన్ రెడ్డి హిస్టరీని కడిగిపారేస్తూ.. సైకో.. నీది టెన్త్ క్లాస్ పేపర్ కొట్టేసిన చరిత్ర, నాది స్టాన్ఫోర్డ్ హిస్టరీ అంటూ లోకేష్ వేసిన పంచ్‌లు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారాయి.
జగన్‌తో బహిరంగ చర్చకు లోకేష్ సవాల్
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బ్రాండ్ వాల్యూను, విజన్‌ను లోకేష్ గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గౌరవం తెచ్చే మూడు అక్షరాల బ్రాండ్ సిబిఎన్ అని, ఆయన ఐటీ నుంచి ఏఐ వరకు, హైటెక్ సిటీ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు భవిష్యత్తును ముందే చూసే విజనరీ లీడర్ అని ప్రశంసించారు. ఒకప్పుడు కియా తెచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఏపీకి ఫైటర్ జెట్ ప్రాజెక్టులను రప్పిస్తున్నారని, దేశంలోనే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయని స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అమరావతి తమ విధానమని చెబుతూ.. సమయం, తేదీ మీరు ఫిక్స్ చేయండి.. ఏపీ అభివృద్ధి, సంక్షేమంపై లైవ్ చర్చకు నేను రెడీ అంటూ వైసీపీనేతకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, అన్న నందమూరి తారక రామారావు ఆశయాలు, సిద్ధాంతాలే టీడీపీకి బలమైన పునాది అని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన మహోన్నతుడు ఎన్టీఆర్ అని లోకేష్ స్మరించుకున్నారు. అదే బాటలో చంద్రబాబు డ్వాక్రా, దీపం పథకాలతో మహిళలను మహాశక్తులుగా మార్చారని గుర్తుచేశారు. 2019 నుంచి 2024 వరకు ఎన్నో అక్రమ కేసులు, వేధింపులను తట్టుకుని ప్రాణాలర్పించిన తోట చంద్రయ్య వంటి అమర వీరులను, చెన్నుపాటి గాంధీ వంటి జెండా వీరులను తలచుకుంటూ.. తెలుగుదేశంలో ఎప్పుడూ ‘కార్యకర్తే అధినేత’ అని చాటిచెప్పారు. అందుకే గజపతినగరం మండల ప్రెసిడెంట్ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ ధనుంజయ్‌లు ఈరోజు పొలిట్ బ్యూరో సభ్యులు కాగలిగారని పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని వివరించారు.
కార్యకర్తే అధినేత – చంద్రబాబు
నాడు సైబరాబాద్‌ను నిర్మించి ఐటీ విప్లవానికి నాంది పలికిన చంద్రబాబు.. ఇప్పుడు ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని చాటిచెప్పారు. దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు క్యూ కడుతున్నాయని గుర్తుచేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ పాలన అందిస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రూ. 4,000 పెన్షన్ పంపిణీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీ, 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్, దీపం-2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాల అమలును ఆయన వివరించారు. గత ఐదేళ్ల కష్టకాలంలో వైసీపీ అరాచకాలను ఎదిరించి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పసుపు జెండాను మోసిన కార్యకర్తలే ఈ విజయానికి అసలైన శిల్పులని చంద్రబాబు కొనియాడారు.
