రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా దాని చుట్టూ ఎగ్జిబిటర్ల పర్సంటేజ్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఇకపై రెంటల్ విధానం వద్దని, పర్సంటేజ్ పద్ధతిలోనే సినిమాలను ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు ఖరాఖండిగా చెబుతున్నారు. నిర్మాతలు మాత్రం ఇప్పటివరకు అమల్లో ఉన్న రెంటల్ సిస్టమ్‌లోనే సినిమాలు విడుదల కావాలని వాదిస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.
అసలు ఎగ్జిబిటర్లకు ఎంత పర్సంటేజ్ కావాలనేది అధికారికంగా బయటకు రాలేదు. అయితే పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వారు 30 శాతం కోరుతున్నారని తెలుస్తోంది. చర్చల్లోకి వస్తే 25 శాతానికి రాజీ పడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని వినిపిస్తోంది. పెద్ది సినిమాకి సంబంధించి 20 శాతానికి మించి ఇవ్వడం సాధ్యం కాదని, అంతేకాదు, మొదటి వారంతో పాటు రెండో వారంలో కూడా అదే శాతం వర్తింపజేయాలనే నిర్మాతల నుంచి వినిపిస్తున్న మాట.
ఇక్కడే అసలు వివాదం మొదలవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెంటల్ విధానంలో మొదటి వారం నిర్మాతలకు ఎక్కువ వాటా లభిస్తుంది. రెండో వారం నుంచి ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుండటంతో థియేటర్ల నిర్వహణ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఎగ్జిబిటర్లు ఎక్కువ వాటా తీసుకుంటారు. ఇది చాలా కాలంగా అమల్లో ఉన్న వ్యాపార నమూనా. కానీ పర్సంటేజ్ విధానంలో మొదటి వారం, రెండో వారం ఒకే శాతం ఉండాలనే నిర్మాత ప్రతిపాదనను ఎగ్జిబిటర్లు అంగీకరించడం లేదు.
‘పెద్ది’ వంటి భారీ చిత్రానికి పర్సంటేజ్ విధానం కోట్ల రూపాయలలో తేడా కనిపించే అవకాశం ఉంది. అందుకే నిర్మాత పాత విధానంలోనే సినిమాను విడుదల చేయాలని చుస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సినిమా నిర్మాత సతీష్ ఇప్పటివరకు ఎగ్జిబిటర్లతో నేరుగా చర్చలకు దిగలేదు. నిర్మాత వస్తే చర్చించేందుకు సిద్ధమని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ‘పెద్ది’కి మినహాయింపు లభిస్తుందనే నమ్మకం నిర్మాతలో బలంగా వుంది.
అయితే తటస్థంగా చూస్తే ఎగ్జిబిటర్ల డిమాండ్‌లో ఒక లాజికల్ సమస్య కనిపిస్తుంది. నిజంగా పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలనుకుంటే ఒక తేదీని నిర్ణయించి, ఆ తేదీ తర్వాత విడుదలయ్యే అన్ని సినిమాలకు ఒకే విధానం వర్తింపజేయాలని చెప్పడం సమంజసం అనే మాట వినిపిస్తోంది. అలా చేస్తే పరిశ్రమ పెద్దలు కూర్చొని ఒక ఆమోదయోగ్యమైన ఫార్ములా తీసుకురాగలరు. కానీ ఒక భారీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో అదే సినిమా నుంచి కొత్త విధానం అమలు చేయాలని పట్టుబట్టడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. వ్యాపారపరంగా కూడా ఇది సరైన సంకేతం కాదని చాలామంది భావిస్తున్నారు.
అయితే ఎగ్జిబిటర్ల వాదనను పూర్తిగా కొట్టిపారేయలేం. పెద్ద సినిమాలు వచ్చినప్పుడే థియేటర్లకు భారీ స్థాయిలో ప్రేక్షకులు వస్తారు. చిన్న, మధ్య తరహా చిత్రాలకు రెండో లేదా మూడో రోజు నుంచే కలెక్షన్లు తగ్గిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో పెద్ద సినిమాల ఆదాయంతోనే మిగతా సినిమాల వల్ల వచ్చే నష్టాలను బ్యాలెన్స్ చేసుకుంటామనేది వారి వాదన.
ఈ వివాదం పరిష్కారం కోసం ఇప్పటికే పరిశ్రమ పెద్దలను కూడా ఆశ్రయించారు. చిరంజీవితో సమావేశం జరిగినా స్పష్టమైన హామీ లభించలేదని తెలుస్తోంది. నిర్మాతల మండలి తరఫున దిల్ రాజు మాట్లాడినా, చాంబర్ అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రమే చెప్పారు. చర్చలు ఎటు వెళ్లాయనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.
మొత్తానికి ఇది కేవలం ‘పెద్ది’ సినిమా సమస్య కాదు. తెలుగు సినిమా నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన వ్యవస్థ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. అయితే ‘పెద్ది’, ‘డ్రాగన్’, ‘స్పిరిట్’, ‘వారణాసి’ లాంటి భారీ చిత్రాలను టార్గెట్ చేస్తూ మార్పు తీసుకురావాలని చూడటం కంటే, ఒక నిర్దిష్ట తేదీ నుంచి అన్ని సినిమాలకు వర్తించే విధంగా నిర్ణయం తీసుకోవడం మరింత సమంజసం. లేదంటే అది సంస్కరణగా కాకుండా, ఒక సినిమాను బలిపీఠంపై పెట్టినట్లే కనిపిస్తుంది. పరిశ్రమ మొత్తం ఆమోదించే విధానం వచ్చినప్పుడే ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
