భారతీయ స్టార్టప్ ప్రపంచంలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా, విజయానికి మారుపేరుగా నిలిచిన బైజూస్ రవీంద్రన్ కు సింగపూర్ న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. తన ఆస్తుల వెల్లడి, నిధుల బదిలీకి సంబంధించిన పత్రాలను సమర్పించడంలో విఫలం కావడం వల్లే ఆయనకు ఈ శిక్ష పడింది. ఒకప్పుడు ఫోర్బ్స్ జాబితాలో అపర కుబేరుడిగా వెలిగిన రవీంద్రన్ నికర విలువ ప్రస్తుతం సున్నాకు పడిపోవడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా జైలు శిక్షను ఎదుర్కొనే పరిస్థితికి రావడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
2011లో థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రారంభమైన బైజూస్.. డిజిటల్ విద్యా రంగంలో సరికొత్త విప్లవాన్ని తెచ్చింది. ముఖ్యంగా కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో పాఠశాలలు మూతపడటంతో ఆన్లైన్ లెర్నింగ్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. గ్లోబల్ ఇన్వెస్టర్లు బైజూస్‌లో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టారు. 2022 నాటికి ఈ కంపెనీ విలువ ఏకంగా సుమారు రూ. 1.8 లక్షల కోట్లు చేరింది. భారత క్రికెట్ జట్టు జెర్సీపై బైజూస్ లోగో మెరిసింది. లియెనల్ మెస్సీని ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు.
ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, గ్రేట్ లెర్నింగ్, ఎపిక్ వంటి పెద్ద పెద్ద కంపెనీలను దాదాపు 3 బిలియన్ డాలర్లు వెచ్చించి బైజూస్ వేగంగా కొనుగోలు చేసింది. కానీ, ఈ మితిమీరిన విస్తరణే ఆ కంపెనీ పతనానికి పునాది వేసింది. 2021 నవంబర్‌లో విదేశీ రుణదాతల నుంచి బైజూస్ 1.2 బిలియన్ డాలర్ల భారీ రుణాన్ని సేకరించింది. అయితే, కంపెనీ తన ఆడిట్ నివేదికలను సమర్పించడంలో తీవ్ర జాప్యం చేయడంతో ఇన్వెస్టర్లలో అనుమానాలు మొదలయ్యాయి. చివరకు బయటపడిన 2021 ఆర్థిక సంవత్సర నివేదికలో ఏకంగా రూ. 4,588 కోట్ల నష్టాలు నమోదు కావడంతో ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు.
విదేశీ రుణదాతలకు, బైజూస్‌కు మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. లోన్ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 533 మిలియన్ డాలర్ల నిధులను బైజూస్ యాజమాన్యం ఎవరికీ చెప్పకుండా విదేశీ ఖాతాలకు మళ్లించిందని రుణదాతలు అమెరికా కోర్టుల్లో కేసులు వేశారు. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి చెందిన ఒక అనుబంధ సంస్థ సింగపూర్ కోర్టులో వేసిన పిటిషన్ విచారణలో భాగంగా.. ఆస్తుల యాజమాన్య పత్రాలను సమర్పించాలన్న కోర్టు ఆర్డర్లను బైజూ రవీంద్రన్ పదే పదే ఉల్లంఘించారు. దీంతో సింగపూర్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది.
అంతర్జాతీయంగా చట్టపరమైన ఉచ్చు బిగుస్తుండగానే, స్వదేశంలోనూ బైజూస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి కి చెల్లించాల్సిన రూ. 158 కోట్ల ప్రాయోజిత బకాయిలను కట్టకపోవడంతో, 2024 జూలైలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బైజూస్‌పై దివాలా ప్రక్రియను ప్రారంభించింది. ఒకప్పుడు లగ్జరీ ఆఫీసులతో వెలిగిపోయిన కంపెనీకి ఇప్పుడు విలువే లేకుండా పోయింది. బైజూస్ రవీంద్రన్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో ఎవరికీ తెలియదు. ఆయన దుబాయ్‌లో తలదాచుకుంటున్నట్లుగా అనుమానాలున్నాయి.


