విశాఖపట్నం అంతర్జాతీయ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించడానికి సిద్ధమైంది. భోగాపురంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జూలై 5న ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. జూలై 8 నుండి ఇక్కడి నుంచి వాణిజ్య విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్ ప్రారంభ తేదీ దగ్గర పడుతుండటంతో.. ప్రస్తుతం అందరి దృష్టి రన్‌వేలపై కంటే, విమానాశ్రయానికి అనుసంధానించే రహదారులపైనే పడింది. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులు క్షేమంగా, సకాలంలో చేరుకోవడానికి నిర్మిస్తున్న రహదారులు జూలై నాటికి రెడీ అవుతాయా లేదా అనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.
విశాఖపట్నం, విజయనగరం జిల్లాల అధికార యంత్రాంగం ప్రస్తుతం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లపైనే పూర్తి ఫోకస్ పెట్టింది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు లీడ్ చేసే ప్రధాన మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులన్నింటినీ జూన్ ఆఖరి నాటికి పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. విమానాశ్రయం లోపలి పనులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ దాదాపు సిద్ధమైనప్పటికీ, ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు వీఎంఆర్డీఏ , ఆర్అండ్బీ శాఖలు రాత్రింబగళ్లు శ్రమిస్తున్నాయి.
ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీని పెంచేందుకు 7 వ్యూహాత్మక రహదారులను ప్రాధాన్యత క్రమంలో నిర్మిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో వేగంగా సాగుతున్న వేపగుంట-పినగాడి కారిడార్ దాదాపు 60 అడుగుల మేర విస్తరణ పూర్తి చేసుకుని జూన్ 15 నాటికి అందుబాటులోకి రానుంది. మరో కీలక గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ అయిన వేపగుంట-జుత్తాడ రోడ్డుకు అటవీ, రక్షణ శాఖల భూముల సమస్యలు తొలగిపోవడంతో పనులు ఊపందుకున్నాయి. అయితే, జాతీయ రహదారి పై ప్రయాణించే వారికి సవరవల్లి వద్ద నేరుగా ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధానించే మేజర్ ఇంటర్చేంజ్ ఫ్లైఓవర్ పనులు జూన్ కల్లా పూర్తి కావడం అత్యంత కీలకంగా మారింది.
ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే నగరంలో అత్యధిక ట్రాఫిక్ ఒత్తిడి ఎదుర్కొనేది మధురవాడ ప్రాంతమే. క్రికెట్ స్టేడియం నుంచి కొమ్మాది జంక్షన్ వరకు ఉన్న 3.10 కిలోమీటర్ల సర్వీస్ రోడ్డు ప్రస్తుతం ఉన్న 6.50 మీటర్ల నుంచి మరో 4 మీటర్లు విస్తరించే పనులు చేపట్టారు. ఈ ఐటీ హబ్ మీదుగానే ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ వెళ్లాల్సి రావడంతో స్థానికులు, ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం ఫేజ్-1 కింద మిథిలాపురి హుడా కాలనీ, రుషికొండ ఐటీ జోన్ వైపు వెళ్లే కుడి వైపు సర్వీస్ రోడ్డు విస్తరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు.
ప్రస్తుతం అనకాపల్లి , గాజువాక , వైజాగ్ సిటీ సెంటర్ నుంచి భోగాపురం చేరుకోవడానికి ట్రాఫిక్ వల్ల 1.5 నుండి 2 గంటల సమయం పడుతోంది. దీన్ని ఒక గంట లోపుకు తగ్గించేందుకు లాంగ్ టర్మ్ ప్లాన్ కింద విశాఖ పోర్ట్ నుంచి భోగాపురం వరకు 6 లేన్ల కోస్టల్ బీచ్ కారిడార్ హైవేని ప్రభుత్వం డిజైన్ చేస్తోంది. అంతేకాకుండా, ఎయిర్పోర్ట్ ప్రారంభం రోజే ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో గాజువాక, సింహాచలం టెర్మినల్స్ నుంచి దాదాపు 100 ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నారు. దీనికోసం ఎయిర్పోర్ట్ పరిసరాల్లోనే ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కూడా తుది దశకు చేరుకుంది. జూలై మొదటి వారంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కన్ఫర్మ్ కావడంతో లోకల్ అడ్మినిస్ట్రేషన్ పనుల వేగాన్ని రెట్టింపు చేసింది. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే జూన్ 30 నాటికి కనీసం ప్రధాన అప్రోచ్ రోడ్లు, హైవే జంక్షన్ల సైన్‌బోర్డులు, స్ట్రీట్ లైట్ల పనులైనా 100% పూర్తి కావాల్సి ఉంది.
