తన సొంత ఇల్లు తగలబడుతుంటే పొరుగువాడికి నీళ్లు చల్లినట్లుంది బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు వ్యవహారం!. ఆరెస్సెస్ నేపథ్యం నుంచి వచ్చిన నేత మురళీధర్ రావు రాజకీయ వ్యూహాలు చూసి, ఇప్పుడు సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో ఆయన చేసిన తాజా ట్వీట్ చూశాక, “ఈయన అమాయకత్వానికి అవధులు లేవా? లేక పొలిటికల్ టైమింగ్ అంటే అస్సలు అవగాహన లేదా?” అని కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు.
నాగేశ్వర్ తన మాటలను ఉపసంహరించుకున్నారని, దాన్ని జనసేన కూడా అంగీకరించిందని, ఇక ఇప్పుడు కేసులు పెట్టడం ఎందుకంటూ మురళీధర్ రావు గారు వేసిన శాంతి వచనాలు.. ఇప్పుడు ఆయన పొలిటికల్ కెరీర్‌కే రివర్స్ గేర్ వేసేలా కనిపిస్తున్నాయి. ఇక్కడ నాగేశ్వర్ నిందలు వేసింది ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ మీదో, స్థానిక నేత మీదో కాదు; సాక్షాత్తూ భారతీయ జనతా పార్టీ జాతీయ క్యారెక్టర్ మీద, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యక్తిత్వం మీద! ఢిల్లీ స్థాయి పెద్దలను, పార్టీ సిద్ధాంతాలను బోనులో నిలబెట్టే ప్రయత్నం జరిగినప్పుడు కమ్యూనిస్ట్ మేధావిపై కఠినంగా వ్యవహరించాల్సింది పోయి.. “ఆయన సారీ చెప్పారుగా, ఇక వదిలేయండి” అంటూ మురళీధర్ రావు తరపున కాల్తా పుచ్చుకోవడం ఏ తరహా రాజకీయమో ఎవరికీ అర్థం కావడం లేదు.
దిల్లీ స్థాయిలో, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఒక సీనియర్ నేతకు ఇంత మాత్రం రాజకీయ లాజిక్ తెలియకపోవడంపై ఇటు సోషల్ మీడియాలో, అటు పార్టీ అంతర్గత వర్గాల్లో గట్టి సెటైర్లు పడుతున్నాయి. ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చి, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మురళీధర్ రావు.. ఆ తర్వాత కాలంలో ఎందుకు నెమ్మదిగా సైడ్ లైన్ అయిపోయారో, రాష్ట్ర రాజకీయాల్లో ఎందుకు చక్రం తిప్పలేకపోయారో తెలుసుకోవడానికి ఆయన చేసిన ఈ ఒక్క ట్వీట్ చాలని సెటైర్లు వినిపిస్తున్నాయి.
జనసేన, బీజేపీ శ్రేణులు సదరు ప్రొఫెసర్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతుంటే.. మురళీధర్ రావు గారు మాత్రం ఒక ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ మెంబర్ లాగా మధ్యలో దూరి శాంతి మంత్రాలు పఠించడం ఈ ఏడాదికే పెద్ద పొలిటికల్ జోక్ అని చెప్పుకోవచ్చు. ప్రత్యర్థుల ట్రాప్‌లో ఇంత ఈజీగా పడిపోయే మురళీధర్ రావు లాంటి నేతలు ఉన్నంత కాలం, ప్రత్యర్థి పార్టీలు బీజేపీపై ఎలాంటి అభాండాలు వేయడానికైనా వెనకాడవని కార్యకర్తలువాపోతున్నారు. పాపం.. మురళీధర్ రావు, పెద్దల దృష్టిలో మార్కులు కొట్టేయాలనుకున్నారో ఏమో కానీ, చివరకు సొంత గూట్లోనే నవ్వులపాలయ్యారు!
