ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని విశ్లేషిస్తే, ఒక విచిత్రమైన శూన్యత కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద గళం విప్పాల్సిన ప్రధాన ప్రతిపక్షం వైసీపీ గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు. ఆంధ్ర రాజకీయాలపై విశ్లేషణలు, విమర్శలు మాత్రం పొరుగు రాష్ట్ర నేతలు, ఇతర ప్రాంతాలకు చెందిన మేధావుల నుండే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఏపీ రాజకీయం.. బయట వాళ్ల హడావుడి!
ఓ నాగేశ్వర్, ఓ ప్రకాష్ రాజ్.. ఓ కేటీఆర్.. మరో ఘంటా చక్రపాణి.. ఓ తెలకపల్లి రవి.. ఎవరు వీళ్లంతా?. ఎవరికీ ఏపీతో పనిలేదు. ఏపీ వాళ్లూ కూడా కాదు. కానీ వీళ్లకు ఏపీలో రాజకీయాలు ఎందుకు?. అది కూడా వన్ సైడ్. ఘోరమైన మనుషులు రాజకీయాలు చేసి..పాలన పేరుతో దారుణాలకు దిగినప్పుడు ఒక్కరు కూడా మ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నాగేశ్వర్ అనే వ్యక్తి డబ్బులకు అమ్ముడుపోయిన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూంటే… కేసులు పెడితే మాత్రం అందరూ రెచ్చిపోతున్నారు.
ప్రతిపక్షం ఎక్కడ? అసలు వాళ్లు ఏమైపోయారు?
ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షం బాధ్యత ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టడం. కానీ ఏపీలో వైసీపీ పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. జగన్ తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమవ్వడం వల్ల ప్రజల గొంతు అసెంబ్లీలో వినిపించడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ప్రజా సమస్యలైన పెన్షన్లు, రోడ్లు, లేదా ఉపాధి గురించి కాదు; కేవలం రాజకీయ ఆధిపత్యం కోసమే సాగుతున్నాయి. అమరావతిని అవినీతి రాజధాని అని జగన్ మోహన్ రెడ్డి పదేపదే విమర్శించడం వంటివి .. వ్యక్తిగత కోపంతో చేస్తున్నట్లుగానే ఉన్నాయి. పాత గొడవలను తవ్వి తీయడమే తప్ప, భవిష్యత్తు కోసం చేస్తున్న నిర్మాణాత్మక విమర్శల్లా అనిపించడం లేదు.
అసలు బయట వాళ్లకేంపని?
ఏపీలో ప్రతిపక్షం ఎంత ఘోరంగా ఉందంటే.. సొంత రాష్ట్ర సమస్యలపై ఇక్కడి నేతలు మాట్లాడక ముందే, హైదరాబాద్లో కూర్చున్న నేతలు లేదా మేధావులు రియాక్ట్ అవుతున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు ఒక తప్పుడు సంకేతాన్ని పంపిస్తోంది. ప్రభుత్వం చేసే పనుల్లో లోపాలుంటే సరిదిద్దాల్సిన బాధ్యత కలిగిన వైసీపీ, ఆ బాధ్యతను వేరే రాష్ట్ర నేతలకు వదిలేసినట్లు కనిపిస్తోంది. ఒకవేళ వైసీపీ ఇప్పుడైనా మేల్కొని క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడకపోతే.. ఆ ఖాళీని ఇతర శక్తులు భర్తీ చేస్తాయి. బయట వాళ్లు చేసే రాజకీయ విమర్శలు కేవలం ‘అవకాశవాదం’గా మాత్రమే మిగిలిపోతాయి తప్ప, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవి ఏ విధంగానూ మేలు చేయవు.
