ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. 2010 నాటి కొచ్చి టస్కర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ వివాదం, కాంగ్రెస్ అగ్రనాయకత్వం తనపై తెచ్చిన రాజకీయ ఒత్తిళ్లు, , అండర్‌వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం నుండి తనకు వచ్చిన ప్రాణహాని బెదిరింపుల గురించి ఆయన వెల్లడించిన విషయాలు ఇప్పుడు క్రీడా, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
స్టేడియం లేకపోయినా కొచ్చికి ఎందుకు ఛాన్స్ ఇచ్చానంటే?
గతంలో ఐపీఎల్ జట్లను ఖరారు చేసినప్పుడు కొచ్చికి ఓ టీమును ఖరారు చేశారు. ఒక క్రికెట్ స్టేడియం కూడా లేని కొచ్చి జట్టును తాను ఎలా అనుమతించాననే ప్రశ్నను ఇప్పటివరకు ఎవరూ అడగలేదని లలిత్ మోదీ పేర్కొన్నారు. కొచ్చికి ఎందుకు అవకాశమిచ్చానంటే.. అప్పట్లో శశి థరూర్ నా చుట్టూ తిరిగారు. నన్ను బయటకు తీసుకెళ్లారు, నా ఇంటికి వచ్చారు. ఆయన మాటకారి, చాలా సున్నితంగా, ఆకట్టుకునేలా మాట్లాడతారు. ఆ మాయమాటలకు నేను పడిపోయాను. కానీ, ఆ తర్వాత కొచ్చి ఫ్రాంచైజీకి సంబంధించిన అనుమానాస్పద ఈక్విటీ నిర్మాణం, శశి థరూర్ భార్య సునంద పుష్కర్ పేరిట ఉన్న 25 శాతం ఉచిత షేర్ల వ్యవహారాన్ని నేను ప్రశ్నించడంతో అసలు కథ మొదలైంది అని మోదీ గుట్టు ఇప్పుడు బయట పెట్టారు.
కాంగ్రెస్ పెద్దల ఒత్తిడి.. సోనియా గాంధీ అండ!
కొచ్చి ఫ్రాంచైజీ వెనుక ఉన్న షాడో ఇన్వెస్టర్ల వివరాలు తేలేవరకు తాను అగ్రిమెంట్‌పై సంతకం చేయనని బెంగళూరు అర్ధరాత్రి సమావేశంలో భీష్మించుకు కూర్చున్నట్లు లలిత్ మోదీ వెల్లడించారు. ఆ సమయంలో అప్పటి కేంద్ర మంత్రి శశి థరూర్ తనకు ఫోన్ చేసి, సునంద పుష్కర్ గురించి ఎక్కువగా అడగవద్దని, అలా అడిగితే మరుసటి రోజు ఉదయమే మీ ఇళ్లపై ప్రభుత్వ సంస్థలతో దాడులు చేయిస్తానని నేరుగా బెదిరించారని మోదీ ఆరోపించారు. నువ్వు విదేశాంగ మంత్రివి కావచ్చు, కానీ నాపై ఇలాంటి బెదిరింపులు సాగవు అని తాను తిరస్కరించినట్లు చెప్పారు. ఈ వివాదంలో శశి థరూర్‌కు సోనియా గాంధీ పూర్తి అండదండలు ఉన్నాయని, తనను తొక్కేయడానికి అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీ, రాజీవ్ శుక్లా వంటి అప్పటి యూపీఏ ప్రభుత్వ యంత్రాంగమంతా ఏకమై తనపై ఒత్తిడి తెచ్చిందని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐపీఎల్ బెట్టింగ్‌లో డీ-కంపెనీ .. దావుద్ బెదిరింపులు
తాను క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ నుండి పూర్తిగా తప్పుకోవడానికి అండర్‌వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం, అతని గ్యాంగ్ నుండి వచ్చిన బెదిరింపులే ప్రధాన కారణమని లలిత్ మోదీ విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్లపై తాను కఠినమైన నిబంధనలు అమలు చేయడం సట్టా బజార్‌ను శాసిస్తున్న డి-కంపెనీకి నచ్చలేదన్నారు. దావుద్ ఇబ్రహీం ఒక పేరుమోసిన బుకీ. అప్పట్లో క్రికెట్ సट्टेబాజీలపై అతనికి పూర్తి నియంత్రణ ఉండేది. ఆ రోజుల్లో ఒక మ్యాచ్‌పై 2 బిలియన్ డాలర్ల అక్రమ బెట్టింగ్ జరిగితే, ఈ రోజు ప్రతి మ్యాచ్‌కూ 4 బిలియన్ డాలర్ల రహస్య సట్టా నడుస్తోంది. ఇప్పుడు ఎవరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేయట్లేదు, కేవలం ఓవర్లు, బాల్స్ ఆధారంగా స్పాట్ ఫిక్సింగ్ నడిపిస్తున్నారు అని అండర్‌వరల్డ్ నెట్వర్క్ గురించి వెల్లడించారు.
నిజాలు చెప్పడం వల్లే నాకీ గతి పట్టింది
ఐపీఎల్ భవిష్యత్తు నాశనం కాకూడదనే ఉద్దేశంతోనే తాను నిజాలను నిర్మొహమాటంగా బయటపెట్టానని, అదే తనకు శాపంగా మారిందని లలిత్ మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. నేను భవిష్యత్తును ముందే ఊహించగలను. కొచ్చి ఫ్రాంచైజీ ఆర్థిక మోడల్ అట్టర్ ప్లాప్ అని, అది రెండేళ్లలోనే కూలిపోతుందని నేను నాడే చెప్పాను. నేను ఏం అంచనా వేశానో భవిష్యత్తులో అదే నిజమైంది . ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ మునిగిపోకూడదనే నేను సత్యం కోసం పోరాడాను, కానీ వ్యవస్థ నన్ను టార్గెట్ చేసింది అని లలిత్ మోదీ చెప్పుకొచ్చారు.
ఈ ఇంటర్యూ ఇప్పుడు రాజకీయంగానూ పెను సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
