పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ ఎమ్మెల్యేగానూ ఓడిపోవడం కీలక మలుపు. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎవరు అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. పార్టీ వారసుడిగా గుర్తింపు పొందిన అభిషేక్ బెనర్డీ ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు మమతా బెనర్జీకి ఎమ్మెల్యేగా గెలిచే మరో చాన్స్ వచ్చింది. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి తాను పోటీ చేసిన రెండు స్థానాలైన నందిగ్రామ్, భవానీపూర్లలో విజయం సాధించారు. ఊహించని విధంగా మమతా బెనర్జీ సొంత కోట అయిన భవానీపూర్ స్థానాన్ని తన వద్దే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు. తన రాజకీయ కంచుకోటగా భావించే నందిగ్రామ్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు.
సాధారణంగా నేతలు తమ సొంత నియోజకవర్గాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు, కానీ సువేందు ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉంది. భవానీపూర్ స్థానాన్ని మమతా బెనర్జీకి తిరిగి దక్కకుండా చేయడమే ఆయన ప్రధాన ఉద్దేశం. ఒకవేళ ఆయన భవానీపూర్‌కు రాజీనామా చేసి ఉంటే, అక్కడ జరిగే ఉపఎన్నికలో మమతా పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశాన్ని పూర్తిగా మూసివేస్తూ, ఆమెను అసెంబ్లీకి దూరం చేసేలా సువేందు పావులు కదిపారు.
ఈ పరిణామంతో తృణమూల్ కాంగ్రెస్ డైలమాలో పడింది. ముఖ్యమంత్రిగా ఓడిపోయిన మమతా బెనర్జీ ఇప్పుడు మళ్లీ ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావాలంటే ఉపఎన్నిక జరిగే స్థానం కోసం వెతకాల్సి ఉంటుంది. సువేందు రాజీనామా చేసిన నందిగ్రామ్ ఇప్పుడు ఖాళీ అయింది. గతంలో 2021లో నందిగ్రామ్‌లో పోటీ చేసి ఓడిపోయిన చేదు అనుభవం ఉన్నప్పటికీ, ఇప్పుడు మమతా మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తారా అన్నది సందేహమే. ఎందుకంటే నందిగ్రామ్ ..సువేందు కంచుకోట. సీఎంగా ఉండి ఆ స్థానాన్ని ఆయన రికార్డు మెజార్టీతో బీజేపీ గెలిచేలా చేస్తారు. నందిగ్రామ్ ఉపఎన్నికలో మమతా పోటీ చేస్తే అది మరోసారి హై వోల్టేజ్ పోరుగా మారుతుందని అనుకోవచ్చు. కానీ మమత నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది.
