బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతల తీరుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ పగ్గాలను కేసీఆర్ మళ్లీ తన చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన వారికి జ్ఞాపకశక్తి చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని ఒవైసీ ఎద్దేవా చేశారు. గతంలో తమ హయాంలో జరిగిన ఘటనలను మర్చిపోయి, ఇప్పుడు నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఆయన ఘాటు విమర్శలు సంధించారు.
ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన మైనర్ బాలికపై అఘాయిత్యం కేసును ఒవైసీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆనాడు ఒక ప్రభుత్వ బోర్డు చైర్మన్ కుమారుడు ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడని ఆరోపణలు వచ్చాయని, ఆ సమయంలో మీ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు ఇతర ఘటనలపై గగ్గోలు పెట్టడం బీఆర్ఎస్ నేతల ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు.
ఇక బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన కేసును ఒవైసీ ప్రస్తావించారు. ఇప్పుడు ఉద్యమం చేస్తున్న వారు ఆనాడు ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలకు నాపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారు కానీ, గతంలో ఒక ఆలయం సమీపంలో జరిగిన ఘటన విషయంలో మీరు ఎలా వ్యవహరించారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి అని హితువు పలికారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను ఎలా వాడుకున్నారో మర్చిపోయి ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవాలను కప్పిపుచ్చి, కేవలం రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, ఇది పార్టీకి మొదటి సెట్ బ్యాక్ అవుతుందని ఆయన హెచ్చరించారు. ఓవైసీ వ్యాఖ్యలు మరోసారి పాత కేసును తెరపైకి తెచ్చాయి. ఆ కేసు ఆధారంగానే ఓ సినిమా కూడా వచ్చింది.


