భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో కీలక నేతల భేటీ జరిగింది. ముఖ్యమైన అంశాలపై చర్చించాలని కేసీఆర్ 23మంది సీనియర్ నేతలకు సమాచారం ఇచ్చారు. వారు ఎర్రవెల్లికివెళ్లారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించే దిశగా కేసీఆర్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారని..ఈ క్రమంలో తన ఆలోచనల్ని కీలక నేతలకు వివరించారని అంటున్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కీలక నేతలు హాజరైన ఈ భేటీలో.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల పునర్వ్యవస్థీకరణపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో కంటే భిన్నంగా, సాంకేతికతను జోడించి గ్రామాల వారీగా సభ్యత్వాలను పెంచాలని, పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించడం ద్వారా పార్టీలో జవాబుదారీతనాన్ని పెంచాలని నిర్ణయించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రతి కార్యకర్తకూ అండగా ఉండేలా సంస్థాగత రక్షణ వ్యవస్థ ను బలోపేతం చేయాలని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే అంశంపై కూడా ఈ భేటీలో లోతైన చర్చ జరిగింది. ధరణి సమస్యలు, రైతు రుణమాఫీ, ఇతర హామీల అమలులో జరుగుతున్న జాప్యంపై పోరాట కార్యాచరణను కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ బహిరంగ సభల కంటే, జన చైతన్య యాత్రల వంటి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని భావిస్తున్నారు.
