కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘనవిజయం సాధించినప్పటికీ, ముఖ్యమంత్రిని మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేయలేకపోతోంది. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా పూర్తయినప్పటికీ, కేరళలో మాత్రం స్థానిక నేత వర్సెస్ హైకమాండ్ సన్నిహితుడు అనే పోరు కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసింది. ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా ఉంటూ పార్టీని గెలిపించిన సతీశన్ , ఒకవైపు.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ మరోవైపు సీఎం రేసులో ఉండటంతో రాహుల్ నిర్ణయం వాయిదా వేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పోరాడి, ఎన్నికల్లో విజయానికి కారకులైన నేతలకు కాకుండా, తన అత్యంత సన్నిహితుడైన వేణుగోపాల్‌కు పట్టం కట్టాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, వేణుగోపాల్‌ను ఎంపిక చేస్తే రాష్ట్రంలో పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందని, స్థానిక కేడర్‌లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని రాహుల్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సతీశన్ మద్దతుదారులు పలు జిల్లాల్లో నిరసనలకు దిగడం, వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి పరిణామాలు హైకమాండ్‌కు తలనొప్పిగా మారాయి.
మెజారిటీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతున్నారని ఒక వర్గం ప్రచారం చేస్తుండగా, సతీశన్ లేదా చెన్నితల వంటి స్థానిక నేతలకు ఇవ్వకపోతే దశాబ్ద కాలం తర్వాత వచ్చిన ఈ అధికారం గ్రూపు తగాదాల వల్ల ఆవిరవుతుందని హెచ్చరికలు కూడా రాహుల్కువస్తున్నాయి. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ, ఒకే పేరుపై ఏకాభిప్రాయం కుదరలేదు.
ఈ జాప్యాన్ని ఆసరాగా చేసుకుని అటు ఎల్డీఎఫ్ , ఇటు బీజేపీ విమర్శల దాడిని పెంచాయి. కాంగ్రెస్ తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని, రోజులు గడుస్తున్నా సీఎంను తేల్చుకోలేక పోవడం వారి అసమర్థతకు నిదర్శనమని విమర్శిస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాహుల్ గాంధీ ఒక నిర్ణయానికి రాకపోతే, కేరళ కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు రోడ్డుకెక్కే ప్రమాదం ఉందని కేరళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
