‘ఇదే నా చివరి సినిమా’ అంటూ విజయ్ సగర్వంగా ప్రకటించుకొని, రాజకీయ ప్రవేశం చేశాడు.. ‘జననాయగన్’ సినిమాతో. అయితే విధివశాత్తూ ఆ సినిమా రిలీజ్ కాలేదు. పలుమార్లు రిలీజ్ డేట్ ప్రకటించినా సెన్సార్ నిబంధనలు అడ్డు పడ్డాయి. పైరసీ వల్ల ఇబ్బంది పడింది. ఇప్పుడు ఏ గొడవా లేదు. విజయ్ సీఎం అయిపోయాడు. తన సినిమాకు అడ్డే లేదు. ఈ వేడిలోనే ‘జననాయగన్’ సినిమాని రిలీజ్ చేసి ప్రొడ్యూసర్ క్యాష్ చేసుకొంటాడనిపించింది. అయితే అలాంటి హడావుడి ఇప్పటి వరకూ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తమిళనాడంతా ఇప్పుడు విజయ్ జపం చేస్తోంది. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ పూనకం మీదున్నారు. విజయ్ సీఎం అవ్వగానే అక్కడ కొన్ని పాత సినిమాల్ని రీ రిలీజ్ చేశారు. అవి కాసుల వర్షం కురిపించాయి. అలాంటిది జననాయగన్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ సీఎం అవ్వగానే తెలుగు నాట నుంచి కూడా ఈ సినిమాకు మంచి ఆఫరే అందింది. ఇక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ తీసుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సెన్సార్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకొని, రిలీజ్ డేట్ ప్రకటించడమే తరువాయి. కానీ నిర్మాత ఆ దిశగా ప్రయత్నాలేం మొదలెట్టలేదు.
దానికి కారణం విజయ్ అనే తెలుస్తోంది. విజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకుండా.. నిర్మాత ఏం చేయలేరు. విజయ్ మూడ్ అంతా ప్రస్తుతం రాజకీయాలపైనే ఉంది. తన ప్రతీ చిన్న మూవ్ని ప్రతిపక్షాలు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వచ్చీ రాగానే, తన సినిమాకు క్లియరెన్స్ ఇచ్చుకొంటే, అది తప్పుడు సంకేతాల్ని అందించేలా ఉంటుంది. కాబట్టి.. విజయ్ కొన్ని రోజుల పాటు సినిమా విషయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే నిర్మాత కూడా ఒత్తిడి చేయలేకపోతున్నాడు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా, కనక వర్షం కురవడం ఖాయం అని తమిళ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నిర్మాత ధైర్యం కూడా అదే కావొచ్చు.