టీపీసీసీ చీఫ్ ను మారుస్తారని కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో ప్రచారం ప్రారంభమయింది. పట్టుబట్టి మరీ టీపీసీసీ అధ్యక్ష పీఠాన్ని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ఇప్పించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆయన పనితీరుపై అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఈ సమయంలోనే పీసీసీ బాస్‌ను మార్చబోతున్నారంటూ కాంగ్రెస్ అనుకూల ప్రధాన స్రవంతి మీడియా సంస్థల్లో వరుస కథనాలు రావడం కలకలం రేపింది. ఈ ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర గందరగోళానికి దారితీయడంతో, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శనివారం ఈ వ్యవహారంపై అత్యంత స్పష్టతనిచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలను తాను చాలా లైట్‌గా తీసుకుంటున్నానని, తెలంగాణ పీసీసీ పనితీరుపై హైకమాండ్‌కు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
గత రెండు రోజులుగా కాంగ్రెస్‌కు పూర్తి అనుకూలంగా ఉండే ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌తో పాటు సోషల్ మీడియా వేదికగా మహేష్ కుమార్ గౌడ్‌ను డిజాస్టర్ ప్రెసిడెంట్ గా చిత్రీకరిస్తూ ప్రత్యేక ప్రోగ్రామ్స్ రన్ చేయడం గాంధీ భవన్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పీడ్‌ను అందుకోవడంలో మహేష్ విఫలమయ్యారని సదరు కథనాల సారాంశం. అయితే, ఈ దుష్ప్రచారం వెనుక సీఎం క్యాంప్ హ్యాండ్ ఉందనే అనుమానాలను పార్టీలోని బీసీ సామాజికవర్గ నేతలు గట్టిగా వ్యక్తపరుస్తున్నారు.
తనపై వస్తున్న నెగెటివ్ వార్తలపై మహేష్ కుమార్ గౌడ్ శనివారం గట్టిగా స్పందించారు. ఏదో ఒక ఛానెల్ కూర్చొని నాపై అడ్డగోలు కథనాలు రాస్తే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. గత 20 నెలలుగా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా నా పనితీరు ఏంటో మా హైకమాండ్‌కు, పార్టీ నేతలకు బాగా తెలుసు. కొన్ని మీడియా సంస్థలకు కొన్ని సొంత అభిప్రాయాలు ఉంటాయి.. దానికి నేనేం చేయలేను అని తేల్చిచెప్పారు. ఈ నిరాధారమైన వార్తలపై కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ ఆందోళన చెందవద్దని, సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. మీడియా సర్టిఫికెట్ల కంటే క్షేత్రస్థాయిలో ఉన్న లక్షలాది మంది కేడర్ ఇచ్చే సర్టిఫికెటే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.
రేవంత్ తో ఆయనకు ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలియదు కానీ… తాను డీఎస్, వైఎస్ లా ఉంటామని ఇద్దరూ చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం భిన్నమన ప్రచారంజరుగుతోంది.