ఈ వేసవిలో సరైన సినిమాలేదని ఇటు ప్రేక్షక లోకం, అటు సినీ పరిశ్రమ ముక్త కంఠంతో చెబుతోంది. ఓవైపు ఎండలు భగ్గుమంటున్నాయి. మరోవైపు ఐపీఎల్ గండం ఉంది. మార్నింగ్ షోలకు సూర్య భగవానుడు, నైట్ షోలకు క్రికెట్ మ్యాచ్లు కళ్లెం వేస్తున్నాయి. ఈపరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమని ఫిక్సయిపోయారంతా. అందుకే పెద్ద సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఐపీఎల్ తరవాతే మా సినిమాల్ని విడుదల చేస్తామని నిర్మాతలు కూడా డిసైడ్ అయిపోయారు.
అయితే అనూహ్యంగా డబ్బింగు సినిమాలు డబ్బులు చేసుకొంటున్నాయి. గత వారం విడుదలైన ‘వీరభద్రుడు’ కి బీ,సీ సెంటర్లలో మంచి రెవిన్యూ వస్తోంది. ఈవారం వచ్చిన ‘దృశ్యం 3’ మల్టీప్లెక్సుల్లో బాగానే ఆడుతోంది. ఈ రెండు సినిమాలకూ సరైన రేటింగులు రాలేదు. దానికి తోడు అసలు పబ్లిసిటీనే లేదు. అయినా సరే, టికెట్లు తెగాయి. అలాగని తెలుగు సినిమాలు రావడం లేదా అంటే.. అదేం కాదు. ఈవారం 3 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటిని ప్రేక్షకులు ఏమాత్రం పరిగణలోనికి తీసుకోలేదు. అదే సమయంలో ఎలాంటి హడావుడి లేకుండా విడుదల చేసిన డబ్బింగు సినిమాలకు టికెట్లు తెగాయి. అంటే అర్థం ఏమిటి?
ప్రేక్షకులు సినిమాలు చూడ్డానికి రెడీగానే ఉన్నారు. కాకపోతే సరైన కంటెంట్ కావాలి. స్టార్ బలం కావాలి. సూర్య, మోహన్ లాల్ చిత్రాలకు తెలుగులో ఆదరణ ఉంది. అందుకే రివ్యూలు, ఎండలు, ఐపీఎల్ ని లెక్క చేయకుండా జనాలు సినిమాలు చూస్తున్నారు. అదే తెలుగులో కంటెంట్ ఉన్న సినిమా, అందులోనూ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో… నిందలన్నీ ఎండలపై, ఐపీఎల్ పై వేయకుండా వేసవిలో స్టార్ హీరోల సినిమాల్ని రిలీజ్ చేయడంపై నిర్మాతలు దృష్టి పెడితే మంచిదేమో?
