తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఇంధన పొదుపు చర్యలలో భాగంగా కాన్వాయ్ తగ్గించుకున్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు బయలుదేరిన సీఎం.. కాన్వాయ్‌లో డజన్ల కొద్దీ ఉండే ఎస్కార్ట్ వాహనాల హడావుడిని పక్కన పెట్టి, కేవలం మూడు వాహనాలతోనే అత్యంత సాదాసీదాగా ప్రయాణించి సచివాలయానికి చేరుకున్నారు.
ప్రభుత్వ ఖర్చులను, ఇంధన వినియోగాన్ని వీలైనంతగా తగ్గించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఇచ్చిన పొదుపు సూత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాటిస్తున్నారు. ధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్డుపైకి వస్తున్నారంటే కిలోమీటర్ల మేర రూట్ క్లియరెన్స్ పేరిట సామాన్య ప్రజల వాహనాలను గంటల తరబడి నిలిపివేయడం సర్వసాధారణం. అయితే, రేవంత్ రెడ్డి ప్రయాణంలో అలాంటి ఆంక్షలు ఏవీ లేకుండా.. సిగ్నల్స్ వద్ద ఆగుతూ, రోడ్డుపై వెళ్లే ఇతర సామాన్య వాహనదారులతో పాటే సీఎం కాన్వాయ్ కూడా కలిసి ప్రయాణించింది. ఈ మార్పుతో అటు ఇంధన వృధా అరికట్టడంతో పాటు, ఇటు అత్యవసర పనులపై వెళ్లే ఆఫీస్ ఉద్యోగులు, అంబులెన్స్‌లకు పెద్ద ఊరట లభించింది.
ఈ ప్రయాణంలో అన్నింటికంటే హైలైట్ ఏమిటంటే.. సీఎం సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో అత్యంత కీలకమైన, అత్యంత ఖరీదైన జామర్ వాహనాన్ని కూడా రేవంత్ రెడ్డి పక్కన పెట్టేశారు. జామర్ వాహనం కాన్వాయ్‌తో పాటు వెళ్తున్నప్పుడు అది ప్రయాణించే పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజల మొబైల్ సిగ్నల్స్, నెట్‌వర్క్‌లు పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ విషయాన్ని గమనించిన సీఎం, తన భద్రత కంటే ప్రజల సౌకర్యమే ముఖ్యమని భావించి జామర్‌ను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు
