Peddi Movie Telugu Review
Peddi Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 3/5
స్పోర్ట్ప్ డ్రామాతో ఓ కథ రాసుకోవడం ఈజీ. కానీ మెప్పించడం కష్టం. ఎందుకంటే… మనం ఈ జానర్ లో చాలా సినిమాలు చూసేసుంటాం. పైగా కథ ఎలా నడుస్తుందో ఓ అవగాహన ఉంటుంది. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామాలన్నీ ఒకేలా సాగుతుంటాయి. ఓ ఆటగాడి ప్రయాణం.. పతనం… పరాభవం.. అంతిమంగా విజయం. ఇదే ఏ స్పోర్ట్స్ డ్రామా చూసినా కనిపించే ప్రధానమైన విషయాలు. అందుకే ప్రతీసారీ భావోద్వేగానికి గురి అయ్యేలా చేయడం కష్టం. అందుకే స్పోర్ట్స్ డ్రామాల్లో సక్సెస్ రేట్లు తక్కువగా కనిపిస్తుంటాయి. మన దగ్గర అయితే ఈ జోనర్ లో సినిమాలు చేయడమే మానేశారు. మరీ ముఖ్యంగా పెద్ద హీరోలు. అలాంటిది రామ్ చరణ్ లాంటి ఓ స్టార్, బుచ్చిబాబు అనే ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి, స్పోర్ట్స్ డ్రామాని పట్టాలెక్కించాడంటే కచ్చితంగా ఆ సినిమా గురించి ఆలోచించాల్సిందే. అలా ‘పెద్ది’ అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొంది. దానికి తోడు ‘పెద్ది’ కి ముందు నుంచీ అన్నీ కలిసొచ్చేశాయి. రెహమాన్ అందించిన పాటలు సూపర్ హిట్టు. గ్లింప్స్, టీజర్.. రెండూ నచ్చేశాయి. ట్రైలర్ చూశాక మిక్స్డ్ టాక్ వచ్చినా… వెండి తెరపై ఈ సినిమా ఏదో చేయగలదన్న నమ్మకాన్ని మాత్రం సడలి పోనివ్వలేదు. అన్నింటికింటే ముఖ్యంగా ఈ వేసవి సీజన్ ని ‘పెద్ది’ ఒంటి చేత్తో గట్టెక్కిస్తుందని చిత్రసీమ కూడా బలంగా నమ్మింది. మరి ఈ నమ్మకాలు ఏమయ్యాయి? కాగితంపై రొటీన్ గా కనిపిస్తున్న స్పోర్ట్స్ డ్రామా అనే జోనర్ ని… బుచ్చిబాబు వెండి తెరపై ఎంత రసవత్తరంగా మార్చేశాడు? అసలింతకీ ఈ పెద్ది కథేమిటి?
విజయనగరం జిల్లాలో కొండ కింద ఓ ఊరుంది. ఆ ఊరికంటూ పేరేం లేదు. ఎందుకంటే ఆ ఊరినీ, అక్కడి జనాన్నీ ప్రభుత్వం గుర్తించలేదు. అక్కడెవరికీ ఓటు హక్కు లేదు. గుర్తింపు లేదు. బస్సు లేదు. ట్రైన్ ఆగదు. ఊర్లో ప్రాణాలు ఊర్లోనే పోతుంటాయి. ఆ ఊరి మీదుగా వెళ్లే ట్రైన్ ని ఆపాలని అప్పలసూరి (జగపతిబాబు) ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాడు. కానీ ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటి ఊరి కుర్రాడు పెద్ది (రామ్ చరణ్). బెల్లం బట్టీలో పని చేస్తుంటాడు. ఆట కూలీ కూడా. క్రికెట్ బాగా ఆడతాడు. దాంతో తనని వేలంలో పాడుకొని, జట్టులో ఆడించుకొంటుంటారు. రైల్వే స్టేషన్ కోసం పోరాడుతున్న అప్పల సూరి అదే రైల్వే ట్రాక్ పై ప్రాణాలు కోల్పోతాడు. అది చూసి చలించిపోయిన పెద్ది.. ఆ ఊరికి రైలుతో పాటు, ఆ ఊరి వాళ్లకు గుర్తింపు కూడా తీసుకురావాలని భావిస్తాడు. అందుకోసం ఏం చేశాడు? తన ఆటతో… తన పోరాటంతో దేశం దృష్టిని తన వైపు ఎలా తిప్పుకొన్నాడు? తన ఊరి సమస్యని ఎలా తీర్చాడు? అనేది మిగిలిన కథ.
‘పెద్ది’ కథని బుచ్చిబాబు ఓ మీటర్ లో రాసుకొన్నాడనిపిస్తుంది. హీరోయిజం, ఎలివేషన్లు, ఊరి సమస్య, ఆట, భావోద్వేగాలు, గెలుపోటములు, స్ఫూర్తి, త్యాగం.. ఇలా అన్నీ ఓ కథలో ఉండేలా చూసుకొన్నాడు. ఇందులో అన్నీ.. కమర్షియల్ హంగులే. వీటిలో ఒకట్రెండు క్లిక్ అయినా… సినిమా నడిచిపోతుందన్న నమ్మకం బుచ్చిబాబులో ఉంది. అందుకే ఈ కథని అంత బలంగా నమ్మాడు. స్పోర్ట్స్ డ్రామాలు మనం ఎన్నో చూసుంటాం. కానీ పెద్దిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కథ… ఏ ఒక్క ఆటతోనో మొదలవ్వదు.. పూర్తవ్వదు. ముందు క్రికెట్ తెరపైకి వస్తుంది. ఆ తరవాత కుస్తీ… చివర్లో రన్నింగ్.. ఇలా మూడు వైవిధ్యమైన క్రీడల్ని తీసుకొన్నాడు బుచ్చి. పైగా దానికి క్రాస్ ఓవర్ అథ్లెట్ (రెండు ఆటల్ని కలిపి ఆడేవాడు) అనే కొత్త ప్రయోగాన్ని జోడించి ఈ కథ చెప్పే ప్రయత్నం చేశాడు. సో.. రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామానే అయినా, కొత్త కోణంలో మళ్లించే అవకాశం దక్కింది.
బొమన్ ఇరానీ… హీరోని వెదుక్కుంటూ రావడం, ఆ హీరో కథని ఓ క్యారెక్టర్ ముక్కలు ముక్కలుగా చెప్పుకొంటూ వెళ్లడం.. ఇదంతా రొటీన్ ఫార్మెటే. కానీ ఇలాంటి కథల్ని ఈ పేట్రన్ లో చెప్పడమే సరైన దారి. కాబట్టి రొటీన్ గానే కథ మొదలైనా, పెద్ది రాక, గ్రౌండ్ లో కొట్టే వెరైటీ సిక్సర్ల మోత, ఆ తరవాత వచ్చే రై రై రారా పాట.. ఇవన్నీ ప్రేక్షకుల్ని ఈజీగానే కథలోకి తీసుకెళ్లిపోతాయి. ఓ వైపు ఊరి బాధ చెబుతూ… అసలైన సంఘర్షణకు దర్శకుడు మొదట్నుంచే బీజం వేసే ప్రయత్నం చేసుకొంటూ వెళ్లాడు. అయితే మధ్యలో… జాన్వీ కపూర్ లవ్ ట్రాక్ మాత్రం అసలు కథకు ఏమాత్రం సంబంధం లేకుండా సాగింది. పైగా జాన్వీ పాత్రను దాదాపు వ్యాంప్ పాత్రకు తీసుకొచ్చేశారు. అక్కడ చరణ్, సత్యలతో కొన్ని ముతక డైలాగులు కూడా పలికించాల్సివచ్చింది. ఈ ట్రాక్ కచ్చితంగా పంటి కింద రాయిలా తగులుతుంది. జగపతిబాబు పాత్ర లో మెలోడ్రామా కొంత ఓవర్ డోస్ అయినట్టు కనిపిస్తుంది. అయితే పోలీస్ స్టేషన్ సీన్, అక్కడ తమకు గుర్తింపు లేదన్న విషయాన్ని హీరో గుర్తించడం, ఆ తరవాత కుస్తీ ఆట నేర్పమని శివ రాజ్ కుమార్ దగ్గరకు వెళ్లడం, ఇంట్రవెల్ బ్యాంగ్ ఇవన్నీ పక్కాగా కమర్షియల్ మీటర్ లో వచ్చి కూర్చున్నాయి. ఫస్టాఫ్ అయ్యాక… బయటకు వస్తే చరణ్ నటన, పాటలు గుర్తొచ్చి, టికెట్ రేటుకి గిట్టుబాటు అయిన ఫీలింగ్ వస్తుంది.
సెకండాఫ్‌లో కుస్తీ ఫైట్ హైలెట్ గా నిలిచింది. క్రాస్ ఓవర్ అథ్లెట్ అన్న పాయింట్ ఇక్కడే ప్రస్తావించాడు దర్శకుడు. ఆ ఫైట్ కంపోజీషన్ బాగా కుదిరింది. రెగ్యులర్ ఫైట్స్ మధ్య.. ఇలాంటి కుస్తీ పోటీ కచ్చితంగా పైసా వసూల్ మూమెంట్ లాంటిదే. ఐటెమ్ పాట ఎందుకో.. కుదర్లేదు. జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు కూడా పెద్దగా కంటికి ఆనలేదు. బహుశా.. పాటకు సరైన ఫ్లాట్ ఫామ్ దొరక్కపోవడం వల్ల ఎక్కలేదేమో? కుస్తీ పోటీల్లో పెద్ది పాల్గొనడం, అక్కడ తనకు తగిలిన ఎదురుదెబ్బతో కథలో మరో మలుపు రావడంతో ప్రీ క్లైమాక్స్ కి ముందు కథ మరింత రసవత్తరంగా మారుతుంది. ఆసుపత్రి సీన్ లో చరణ్ నటన నిజంగానే పండింది. కమర్షియల్ హీరోలు ఇలాంటి సీన్లు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ చరణ్ మాత్రం చాలా కసిగా, ధైర్యంగా చేసేశాడు. మొత్తం సినిమాలో చరణ్ నటనకు ఎక్కువ మార్కులు పడేది ఇక్కడే.
ఢిల్లీ ఎపిసోడ్ ఎందుకో అంతగా పండలేదు. అక్కడ కూడా ఎమోషన్ క్యారీ చేయగలిగితే బాగుండేది. క్లైమాక్స్ లో పెద్ది తీసుకొనే నిర్ణయం, ఆ తరవాత తాను ఆడే ఆట.. కచ్చితంగా మనసుల్ని కదిలిస్తుంది. ఓ ఆటగాడు తన ఊరి కోసం ఇంత చేయగలడా? అనేది తలచుకొంటే గుండె బరువెక్కుతుంది. అదే ఫీల్ లో సినిమాకి శుభం కార్డు వేసేశాడు దర్శకుడు.
ఫస్టాఫ్ లో కమర్షియల్ హంగులపై ఎక్కువ ఆధారపడిన బుచ్చిబాబు, సెకండాఫ్ లో వాటి జోలికి వెళ్లలేదు. కథకే కట్టుబడి సినిమాని నడిపించేశాడు. అందుకే సెకండాఫ్ కి వచ్చే సరికి చాలా పాత్రలు కనుమరుగైపోతాయి. ఈ సినిమాలో ప్రత్యేకించి విలన్ ఎవరూ ఉండరు. పరిస్థితులు, ఊరి సమస్యే విలన్లుగా కనిపిస్తాయి. ఓ స్టార్ హీరో సినిమా కోసం ఇలాంటి ఎత్తుగడ వేయడం నిజంగా రిస్కే. కానీ అది ఈసారి పే ఆఫ్ అయ్యింది.
సెకండాఫ్ లో లోపాలు లేకపోలేదు. అంతర్జాతీయ స్థాయి టోర్నీలలో ఆడడం అంత ఈజీనా అన్నట్టు పెద్ది ప్రతీ టోర్నీలోనూ వెళ్లిపోతుంటాడు. అందుకోసం ఏం చేశాడన్నది చూపించలేదు. బొమన్ ఇరానీ స్పోర్ట్స్ అకాడమీ అధికారి. తనకు పెద్ది గురించి తెలియకపోవడం వింత, విడ్డూరం. పైగా తను పెద్ది ఊరికి నడుచుకొంటూ వస్తాడు. ఆ బాట మరీ కష్టంగా ఉంటుంది. అంటే పెద్ది లక్ష్యం ఆ ఊరిలో ట్రైన్ ఆపడం ఒక్కటేనా, రోడ్లు సరిగా లేకపోయినా ఓకేనా అనే లాజిక్ కొడుతుంది.
చరణ్ కెరర్ లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పలేం కానీ, ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తోంది. బుచ్చినీ, ఈ పాత్రనీ చరణ్ గట్టిగా నమ్మేశాడు. అందుకే పెద్ది కోసం ఎంత కష్టమైనా పడ్డాడు. పాత్ర కోసం బాడీని మార్చుకొన్న విధానం, యాక్షన్ ఘట్టాల్లో కనిపించిన తీరుకి మంచి మార్కులు పడతాయి. జాన్వీ కపూర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది. మీర్జా పూర్ ఫేమ్ దివ్యాందుని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. తొలి సన్నివేశాల్లో తప్ప.. తాను కనిపించింది లేదు. తన పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడం విచిత్రం. రావు రమేష్ లాంటి నటుల్ని ఒకట్రెండు సీన్లకే పరిమితం చేశారు. జగపతిబాబు పాత్రకు ఇచ్చిన ఎలివేషన్.. స్క్రీన్ పై లేదు. శివరాజ్ కుమార్ పాత్ర నడక, నడత బాగున్నాయి.
టెక్నికల్ గా బాగా స్ట్రాంగ్ గా ఉన్న సినిమా ఇది. తెరపై ప్రతీ సీన్ లావీష్ గా కనిపించింది.యాక్షన్ కొరియోగ్రాఫర్లకు ఎక్కువ పని పడింది. కెమెరా వర్క్, ఆర్ట్.. టాప్ క్లాస్. రెహమాన్ పాటలు ముందే హిట్టు. ఆర్.ఆర్ లోనూ తన మ్యాజిక్ కనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొత్తగా వినిపించింది. బుచ్చిబాబు ఓ కమర్షియల్ హీరోని పెట్టుకొని, ఇలాంటి కథ రాసుకోవడం మెచ్చుకోదగిన విషయమే. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ క్లైమాక్స్ ని నమ్మి రాయడం, నటించడం ఈ రెండు విషయాల్లో బుచ్చి,చరణ్‌లకు మార్కులు పడతాయి.
తెలుగు సినిమాకు ఇప్పుడు ఓ మంచి విజయం కావాలి. జనాలు థియేటర్లకు రావాలి. మళ్లీ బాక్సాఫీసు కళకళలాడాలి. ఇవన్నీ జరగాలంటే పెద్ది లాంటి సినిమాలు బాగా ఆడాలి. చరణ్‌కున్న ఇమేజ్, ఈ సినిమాకున్న హైప్ తో.. కచ్చితంగా ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఫ్యాన్స్ ఇరగబడి చూస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్లకు రప్పిస్తే పెద్ది సక్సెస్ అయినట్టే. ఆ విషయంలోనూ పెద్దిలో దమ్ముంది. కానీ అది ఏ స్థాయిలో అనేది బాక్సాఫీసు నెంబర్లు నిర్ణయిస్తాయి.
తెలుగు360 రేటింగ్: 3/5
