హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ నవనిర్మాణ సభ కు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం, ఆపై జరిగిన పొలిటికల్ హైడ్రామా కేవలం ఒక శాంతిభద్రతల సమస్య కాదు. దీని వెనుక అత్యంత లోతైన రాజకీయ వ్యూహాలు, రాబోయే ఎన్నికల సమీకరణాలు దాగి ఉన్నాయి. పవన్ కల్యాణ్ పట్ల కాంగ్రెస్ పార్టీ ఇంతగా కంగారుపడటం, ఎన్నడూ లేనంత అగ్రెసివ్‌గా దాడికి దిగడం ఆవేశంలోనో.. ఆలోచన లేకనో చేసింది కాదు.
మారిన పొలిటికల్ సీన్ – సాఫ్ట్ అయిన బీఆర్ఎస్
తెలంగాణ రాజకీయాల్లో సాధారణంగా ప్రాంతీయ సెంటిమెం ప్రస్తావన వస్తే.. అందరికంటే ముందు అత్యంత ఘాటుగా స్పందించేది భారత్ రాష్ట్ర సమితి . కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించినా, సభ పెట్టాలని చూసినా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమాత్రం దూకుడు ప్రదర్శించలేదు. పవన్ కల్యాణ్ గతంలోనూ ఇక్కడ పోటీ చేశారు, పార్టీని విస్తరించుకోవడం ఏ పొలిటికల్ పార్టీకైనా కామనే అంటూ చాలా లైట్ తీసుకున్నారు. పవన్‌తో తనకు బ్రదర్లీ రిలేషన్ ఉందంటూ స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రదర్శించారు. పవన్ కూడా కేసీఆర్ ఎప్పుడూ బెదిరించలేదని ప్రశంసించడం ద్వారా ఇరు పక్షాల మధ్య ఒక సయోధ్య కుదిరినట్లు స్పష్టమైంది.
కాంగ్రెస్ దూకుడు వెనుక ఆంధ్రా ఫార్ములా భయం
బీఆర్ఎస్ ఇంత సాఫ్ట్‌గా ఉంటే.. అధికార కాంగ్రెస్ మాత్రం పవన్‌ను తెలంగాణ వ్యతిరేకి గా ప్రొజెక్ట్ చేస్తూ మంత్రులను సైతం రంగంలోకి దించి విరుచుకుపడింది. దీనికి అసలైన కారణం కాంగ్రెస్‌లో నెలకొన్న తీవ్ర ఆందోళనే. ఆంధ్రప్రదేశ్‌లో వ్యతిరేక ఓటు చీలిపోకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి కట్టి ఏ రకమైన ఏకపక్ష ఫలితాలు సాధించాయో కాంగ్రెస్ అధిష్టానం కళ్లారా చూసింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే తరహా కూటమి బీజేపీ + బీఆర్ఎస్ + జనసేన గనుక ఏర్పడితే.. ఇక్కడ కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి వస్తుందన్న ఆందోళన కనిపిస్తోంది.
కాంగ్రెస్ ముందస్తు వ్యూహం
కాంగ్రెస్ ఆలోచన ప్రకారం.. వచ్చే జీహెచ్ఎంసీ లేదా తదుపరి అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ, బీఆర్ఎస్, జనసేన అంతర్గతంగా లేదా బహిరంగంగా ఒక అవగాహనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న భారీ ఆంధ్రా సెటిలర్ల ఓట్లు, యువత క్రేజ్ కలిస్తే కూటమికి తిరుగుండదు. అందుకే, ఈ కూటమి అసలు ప్రాణం పోసుకోకముందే దెబ్బకొట్టాలని కాంగ్రెస్ స్కెచ్ వేసింది. అందులో భాగంగానే, పవన్ కల్యాణ్‌ను ఒక తెలంగాణ వ్యతిరేకి గా ముద్ర వేయాలని చూస్తోంది. పవన్‌ను ప్రాంతీయంగా బ్లేమ్ చేస్తే.. ఆయనతో జతకట్టడానికి బీజేపీ, బీఆర్ఎస్ లు భయపడతాయని, వెనక్కి తగ్గుతాయని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పవన్ కేవలం ఏపీ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు 30-40 స్థానాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారగల సామాజిక వర్గాలపై ఆయనకు గట్టి పట్టు ఉంది. ఈ ఓట్లన్నీ ప్రతిపక్షాల వైపు పడితే కాంగ్రెస్ పతనం ఖాయం. అందుకే, పవన్‌కు తెలంగాణ గడ్డపై పొలిటికల్ స్పేస్ ఇవ్వకుండా.. రౌడీయిజం, సెంటిమెంట్ పాలిటిక్స్ అంటూ కాంగ్రెస్ ఇంతలా అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతోంది.
రాజకీయాల్లో ఏ పరిణామమైనా ఒక రాత్రిలో మారిపోవచ్చు. కాంగ్రెస్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం కంటే.. బలమైన సోషల్ ఇంజనీరింగ్, గ్లామర్ ఉన్న కూటమిగా ఏర్పడటమే బెటర్ అని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తున్న ఈ మితిమీరిన దాడి.. పవన్‌ను అణచివేయడం పక్కన పెడితే, ఆయనను తెలంగాణ రాజకీయాల్లో మరింత బలమైన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మార్చేసింది. మరి కాంగ్రెస్ అనుకుంటున్నట్లుగా బీజేపీ-బీఆర్ఎస్-జనసేన రాబోయే రోజుల్లో కలిస్తే.. రాజకీయం మారిపోతుంది.


