గొడ్డలి పార్టీ అంటున్నందుకు కౌంటర్ గా జగన్ రెడ్డి తానేదో శాంతిదూతనని చెప్పుకునే ప్రయత్నం చేయడం వికటించింది. రోజూ మీడియా ముందుకు వచ్చి ఆయన ఎంత క్రూరుడో.. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఏం చేశారో బాధితులు అంతా కథలు , కథలుగా చెబుతున్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన పేర్ల పార్థసారథి రెడ్డి అసలు కడపలో ఫ్యాక్షన్ చరిత్ర గురించి అంతా బయట పెట్టారు. జగన్ తనకు ఏదో ప్రాణభిక్ష పెట్టినట్లు మాట్లాడటం హాస్యాస్పదమని.. వైఎస్ కుటుంబం తొలినాళ్ల నుంచి సాగించిన దాడులు, దౌర్జన్యాలు, రాజకీయ హత్యల చిట్టాను బయటపెట్టారు.
రాజారెడ్డి వర్సెస్ పేర్ల పార్థసారధిరెడ్డి ఫ్యాక్షన్
పులివెందుల నియోజకవర్గంలోని వేముల గ్రామానికి చెందిన న్యాయవాది, టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డికి రాజారెడ్డి కుటుంబంతో దశాబ్దాల కాలంగా రాజకీయ, ప్రాంతీయ ఆధిపత్య పోరు ఉంది. వైఎస్ రాజారెడ్డి స్వయంగా దగ్గరుండి తనపై కత్తులతో భయానక హత్యాయత్నం చేయించారని పార్థసారథి రెడ్డి గుర్తుచేశారు. ఈ కేసులో నాటి ఏఎస్పీ పీవీ సునీల్ కుమార్ వైఎస్ రాజారెడ్డిని ఏ-1 ముద్దాయిగా అరెస్ట్ చేశారని, చివరికి జగన్ పెళ్లికి కూడా రాజారెడ్డి కోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ తెచ్చుకుని హాజరయ్యారని సంచలన విషయాలు బయటపెట్టారు. ఆ తర్వాత తమ ప్రాణాలను కాపాడుకునేందుకే, ఆత్మరక్షణ కోసమే తన వర్గీయులు 1998లో రాజారెడ్డిని హతమార్చాల్సి వచ్చిందని ఆయన ఓపెన్‌గా పేర్కొన్నారు.
అంతా హింసతోనే బతికారు
వైఎస్ రాజారెడ్డిని ఏదో గొప్ప మహాత్ముడిగా చిత్రీకరించే ప్రయత్నాలు వద్దని, ఆయన బతికినంత కాలం అంతా హింసతోనే బతికారని పార్థసారథి రెడ్డి మండిపడ్డారు. మీ తాత మనుషులు నన్ను ఎలా నరికారో.. అలాగే మీ తాతను కూడా నా వర్గీయులు నరికారు. మీరంతా పైకి మంచోళ్లలా నటిస్తూ లోపల దాడులు చేసే తేనె పూసిన కత్తులు అని జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. దంతులూరి కృష్ణ అనే వ్యక్తితో కలిసి గతంలో తనపై సూట్‌కేస్ బాంబు ప్రయోగించారన్నారు. వైఎస్ కుటుంబం సాగించిన హత్యా రాజకీయాల వల్ల తాను తన సొంత తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డిని కోల్పోవాల్సి వచ్చిందని, ఆ హత్య కేసులో వైఎస్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి ముద్దాయిలు కాదా? అని నిలదీశారు.
ఎమర్జెన్సీ నాటి హత్యల నుంచి వివేకా మర్డర్ వరకు..
వైఎస్ కుటుంబం ప్రారంభించిందే అక్రమ మైనింగ్ దోపిడీలు, దౌర్జన్యాలతోనని పార్థసారథి రెడ్డి ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో మైనింగ్ యజమాని వెంకట నరసయ్యను హతమార్చి, అప్పటి మంత్రి రహ్మతుల్లా సాయంతో అక్రమంగా మైనింగ్లను వైఎస్ కుటుంబం లాక్కుందని.. ఆ కేసులో రాజారెడ్డి జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. అలాగే జమ్మలమడుగులోని ఓ పోలింగ్ కేంద్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా తుపాకీతో కాల్పులు జరిపినందుకు కేసు నమోదైందని, మాజీ మంత్రి శివారెడ్డిని హత్య చేయించింది కూడా వీరేనని ఆరోపించారు. చివరకు సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపి శత్రువులను కూడా భయపెట్టారని.. వివేకాను చంపకముందు జగన్ ఆయనను స్వయంగా చెంపదెబ్బ కొట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాపం పండింది.. అందుకే 11 సీట్లు!
రాజారెడ్డి నుంచి జగన్ వరకు కిరాయి హత్యలు, నమ్మకద్రోహం, సొంతవారిని వేధించడం వైఎస్ కుటుంబానికి రక్తానే సంక్రమించాయని పార్థసారథి రెడ్డి ఎద్దేవా చేశారు. కన్నతల్లి విజయమ్మను చీకొట్టి పంపేసి, సొంత చెల్లి షర్మిలకు ఆస్తి ఇవ్వకుండా కోర్టులకు లాగి ఇబ్బంది పెడుతున్న జగన్.. బయట మాత్రం తాను మంచోడ్ని అని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. పులివెందులలో రాజకీయ అధిపత్యం కోసం వీరు చేసిన పాపాలు పండాయి కాబట్టే.. దేవుడు గత ఎన్నికల్లో జగన్‌ను 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పరిమితం చేసి రోడ్డున పడేశాడని, రాబోయే రోజుల్లో వైఎస్ కుటుంబ నేర చరిత్రకు పులివెందుల ప్రజలే శాశ్వతంగా చరమగీతం పాడుతారని పార్థసారథి రెడ్డి హెచ్చరించారు.ఎలా చూసినా జగన్ రెడ్డి తమను ఏదో మంచిగా ప్రొజెక్ట్ చేసుకుందామంటే.. పాత చరిత్ర అంతా బయటకు వస్తోంది.