తెలంగాణ ప్రతిపక్ష పార్టీ అయిన భారత్ రాష్ట్ర సమితిలో ప్రస్తుతం నాయకత్వ శైలిపై అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుసరిస్తున్న దూకుడు రాజకీయాలు, ఆవేశపూరిత నిర్ణయాల వల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదనే అసంతృప్తి క్యాడర్లో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో, కేటీఆర్ వైఫల్యాలే మరో సీనియర్ నేత తన్నీరు హరీష్ రావుకు పార్టీ లోపల, బయట సానుభూతిని, పాజిటివ్ ఇమేజ్ను అయాచితంగా పెంచుతున్నాయనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌లను టార్గెట్ చేస్తూ కేటీఆర్ ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్న తీరు, వాడుతున్న భాష సొంత పార్టీ నేతలనే విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వంపై నిర్మాణాత్మకంగా పోరాడటం కంటే, వ్యక్తిగత ఫ్రస్ట్రేషన్‌ను దాచుకోలేక ప్రత్యర్థులపై బూతులు, ఘాటు విమర్శలకే ఆయన పరిమితమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటీఆర్ మాటల తీరు చూస్తుంటే ఆయనకు ఇంకా రాజకీయ పరిణతి వంటబట్టలేదని, కేవలం ఆవేశానికే ప్రాధాన్యం ఇస్తూ రాజకీయ వ్యూహాలను పక్కనబెడుతున్నారని క్యాడర్ ఫిక్సవుతున్నారు.
ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణుల దృష్టి సహజంగానే హరీష్ రావు వైపు మళ్లుతోంది. క్షేత్రస్థాయి రాజకీయాలపై అపారమైన పట్టు, ఎంతటి సంక్షోభ పరిస్థితులనైనా సంయమనంతో ఎదుర్కొనే నేర్పు హరీష్ రావు సొంతం. కేటీఆర్ ఆవేశంతో పార్టీ గ్రాఫ్‌ను దెబ్బతీస్తుంటే, హరీష్ రావు మాత్రం సమయానుకూలంగా స్పందిస్తూ, సమతూకం పాటిస్తూ ఇటు అసెంబ్లీలో, అటు ప్రజల్లో మార్కులు కొట్టేస్తున్నారు. క్లిష్ట సమయాల్లో బీఆర్ఎస్ ను సరైన ట్రాక్‌లో పెట్టగల సమర్థత కేవలం హరీష్ రావుకే ఉందనే డిమాండ్ ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా ఊపందుకుంది.
రాజకీయాల్లో వ్యూహం కంటే ఆవేశం ఎక్కువైతే ఎలాంటి నష్టం జరుగుతుందో ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అర్థమవుతుందని భావిస్తున్నారు. కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం సడలుతున్న కొద్దీ, హరీష్ రావు నాయకత్వానికి డిమాండ్ పెరగడం గులాబీ పార్టీలో మారుతున్న సమీకరణాలకు అద్దం పడుతోంది. కేటీఆర్ తన శైలిని మార్చుకోకపోతే, పార్టీ భవిష్యత్తు కోసం హరీష్ రావును ముందు వరుసలో నిలబెట్టాలనే ఒత్తిడి అధిష్టానంపై మరింత పెరిగే అవకాశం ఉంది.
