తమిళనాడు రాజకీయాలు మరోసారి విలువల మధ్య ఊగిసలాడుతున్నాయి. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే అసెంబ్లీలో బుధవారం జరగనున్న విశ్వాస పరీక్ష ఉత్కంఠ రేపుతోంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో చీలక రావడం, 47 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 30 మంది ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు చేసి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం పెను సంచలనంగా మారింది. పళనిస్వామి రహస్యంగా డీఎంకేతో పొత్తుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి వంటి దిగ్గజ నేతలు విజయ్ పక్షాన చేరారు.
పళనిస్వామి వర్గం తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని, లేనిపక్షంలో అనర్హత వేటు తప్పదని హెచ్చరించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ విప్‌ను ధిక్కరిస్తే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుత స్పీకర్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి చెందిన వారు కావడంతో, ఈ అనర్హత వేటు ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అనే సంశయం నెలకొంది. స్పీకర్ తన విచక్షణాధికారంతో ఈ ప్రక్రియను జాప్యం చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
టీవీకే వ్యూహకర్తలు కేవలం ఈ 30 మందితో ఆగకుండా, విలీనానికి అవసరమైన సంఖ్యను అంటే మొత్తం ఎమ్మెల్యేల్లో 2/3 వంతు, అంటే దాదాపు 32 మంది సాధించేందుకు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒకవేళ 32 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా విడిపోయి టీవీకేలో విలీనమైతే, విప్ ధిక్కరణ కింద అనర్హత వేటు వేసే అవకాశం ఉండదు. అదే జరిగితే అన్నాడీఎంకే చట్టసభలో నామమాత్రపు పార్టీగా మిగిలిపోతుంది.
పళనిస్వామి వర్గం స్పీకర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. గతంలో తమిళనాడులో 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసిన ఉదంతాలను వారు గుర్తు చేస్తున్నారు. బుధవారం జరగబోయే విశ్వాస పరీక్ష కేవలం విజయ్ ప్రభుత్వ మనుగడను తేల్చడమే కాకుండా, అన్నాడీఎంకే భవిష్యత్తును కూడా నిర్ణయించబోతోంది.
