పైరసీని అడ్డుకోవాలని చిత్రసీమ ఏళ్ల తరబడి ప్రయత్నిస్తూనే ఉంది. అందులో పట్టు సాధించినట్టే సాధించినట్టే అనిపిస్తుంది. అంతలోనే.. మళ్లీ కుదేలు అయిపోతుంటుంది. ఈసారి కూడా అదే జరిగింది. చిత్రసీమకు గట్టిగా పట్టిన ‘ఐ బొమ్మ’ అనే పీడని వదిలించుకొంది టాలీవుడ్. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం, ఆ నెట్ వర్క్ అంతా అదుపులోకి తీసుకోవడంతో.. పైరసీ కష్టాలు తొలగినట్టే అనిపించింది. ఐ బొమ్మ రవి కూడా కొన్నాళ్లు జైల్లోనే గడిపాడు. ఆ తరవాత బెయిల్ పై విడుదల అయ్యాడు. తన బ్యాంకు ఖాతాల్ని స్థంభింపజేసిన పోలీసులు, ఐ బొమ్మ మూలాల్నిశోధించి, కట్టడి చేసే ప్రయత్నం చేశారు.
అయితే అనూహ్యంగా ఐ బొమ్మ మళ్లీ ఓపెన్ అవుతోంది. అందులో కొత్త సినిమాలూ కనిపిస్తున్నాయి. ఇది నిజంగానే ఓ అనూహ్యమైన పరిణామం. ఇదంతా బెయిల్ పై విడుదల అయిన రవినే చేస్తున్నాడా, లేదంటే మరెవరైనా ఈ దందాని నడిపిస్తున్నారా అనే దిశగా ఆరాలు, శోధనలు మొదలయ్యాయి. ఇంతకాలం జైల్లో ఉన్న రవి మళ్లీ ఐ బొమ్మ జోలికి వెళ్తాడనిపించడం లేదు. కాకపోతే.. ఐ బొమ్మకి సంబంధించిన సూత్రధారులు రవి ఒక్కడే కాదు. ఇంకా చాలా మందే ఉన్నారన్న విషయం మాత్రం అర్థం అవుతోంది. వాళ్లందరిపై ఇప్పుడు పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం వుంది. ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడంతో పైరసీకి అడ్డుకట్ట పడిందని సంబరపడుతున్న నిర్మాతలకు ఇది పెద్ద షాకే. ఐ బొమ్మని బ్లాక్ చేయడం కేవలం మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. ఇక పోలీసులు, యాంటీ పైరసీ సెల్ నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.
